Site icon vidhaatha

R Narayana Murthy| ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన నారాయ‌ణ‌మూర్తి.. ఆరోగ్యం గురించి ఏమ‌న్నారంటే..!

R Narayana Murthy| పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణ మూర్తి ఇటీవ‌ల అస్వ‌స్థ‌త‌తో ఆసుప‌త్రిలో జాయిన్ అయిన విష‌యం తెలిసిందే . ఈ నెల 17న ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న సమయంలో నారాయణమూర్తి కాస్త నీర‌సం అయ్యారు. అది గ‌మ‌నించిన తోటి న‌టులు అత‌నిని పంజాగుట్ట నిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలోఆయ‌న‌కి చికిత్స జ‌రిగింది. వైద్యులు ఆయనకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి ప్రమాదం లేదని అప్పుడే ప్రకటించారు. కాక‌పోతే ఎందుకైనా మంచిదని నిమ్స్ లోనే నాలుగు రోజుల పాటు డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంచారు. అలా నాలుగు రోజుల పాటు ఆసుప‌త్రిలో ఉన్న నారాయణ మూర్తి డిశ్చార్జ్ అయ్యారు.

అయితే 2 నెలల క్రితం ఆర్ నారాయణమూర్తికి బైపాస్ సర్జరీ జర‌గ‌గా, దాని వ‌ల్ల‌నే కాస్త అస్వ‌స్త‌త‌కి ఆయ‌న లోన‌య్యారు.ఇప్పుడు ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నారు. నిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఆర్ నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ… దేవుడి దయ వల్ల తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని , తనకు చికిత్స అందించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బిరప్పతో పాటు అక్కడి వైద్యులకు నారాయ‌ణ మూర్తి కృతజ్ఞతలు చెప్పారు. తన క్షేమాన్ని కోరుకున్న ప్రజా దేవుళ్లకు శిరస్సు వంచి దండం పెడుతున్నట్టుగా తెలియ‌జేశారు.

అంతకు ముందు.. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆర్ నారాయణ మూర్తిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించి, ఆయ‌న‌కి ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ తరపున తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నో విప్ల‌వ భావాలు క‌లిగిన విప్లవ భావాలు కలిగిన ఆర్.నారాయణమూర్తి.. తన కెరీర్ ప్రారంభం నుంచీ సమాజం కోసమే సినిమాలు తీసారు. సినిమా ఎంత కమర్షియల్‌గా మారినా.. ఆయ‌న మాత్రం ఇప్పటికీ కూడా సమాజంలో ఏదో ఒక సమస్యను సినిమా ద్వారా జ‌నాల‌కి చూపించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. గ‌త ఏడాది యూనివర్సిటీ అనే సినిమాను నారాయణమూర్తి తెరకెక్కించారు. ఇందులో యూనివర్సిటీల్లో కుల రాజకీయాలు, పేపర్ లీక్స్, నిరుద్యోగం వల్ల విద్యార్థులు ఎంతగా నష్టపోతున్నారనే విషయాలను క‌ళ్ల‌కి క‌ట్టిన‌ట్టు చూపించారు.

Exit mobile version