Rakshit to Vijay | రక్షిత్‌ నుంచి విజయ్‌ వరకు… రష్మిక జీవితంలో రెండు ఉంగరాలు, ఒకే హృదయస్పందన

రష్మిక మందన్నా జీవితంలో రెండు నిశ్చితార్థాలు, ఒకే తేదీ. రక్షిత్‌ శెట్టి తో మొదలైన ప్రేమ ఇప్పుడు విజయ్ దేవరకొండతో కొత్త ఆరంభం వైపు అడుగులు వేస్తోంది. ఆనందిద్దాం.. ఆశీర్వదిద్దాం..

Rashmika Mandanna and Vijay Deverakonda engagement story – emotional journey from Rakshit Shetty to Vijay

సినిమా ప్రపంచం ఎప్పుడూ రహస్యాలతో నిండే ఉంటుంది.
తాజాగా టాలీవుడ్‌ చుట్టూ వినిపిస్తున్న చర్చ — విజయ్ దేవరకొండ – రష్మిక నిశ్చితార్థం.
వారి బంధం గురించి గత కొన్ని సంవత్సరాలుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నా, ఇప్పుడు ఉన్నట్టుండి “ఇద్దరూ రహస్యంగా ఉంగరాలు మార్చుకున్నారు” అన్న సమాచారం పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సోషల్ మీడియాలో అయితే ఈ వార్తపై ఉన్మాదం రంకెలేస్తోంది.  ఎందుకంటే ఇది రష్మిక జీవితంలో రెండో నిశ్చితార్థం కాబట్టి.

రష్మిక తొలి ప్రేమ విషాదాంతం

2017లో రష్మిక మందన్నా “కిరిక్ పార్టీ”(2016) చిత్రంతో సాండల్‌వుడ్‌లో సక్సెస్‌ని అందుకున్నప్పుడు, ఆమె జీవితం కూడా కొత్త మలుపు తిరిగింది. ఆ సినిమా హీరో, నిర్మాత రక్షిత్ శెట్టి. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి, జూలై 3, 2017న వారిద్దరూ ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పుడు రక్షిత్‌ 34 ఏళ్లు, రష్మిక 21 ఏళ్లు మాత్రమే. వయస్సు వ్యత్యాసం పెద్దదైనా, ప్రేమ మాత్రం నిజమైనదే. అప్పుడు రష్మికకు ఏమీ తెలియదు. కెరీర్​పై అవగాహన లేదు కూడా. అన్నట్లు ఈ కిరిక్​ పార్టీ దర్శకుడు మరెవరో కాదు, కాంతార రిషభ్​ శెట్టి.

అయితే, ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. 2018లో ఈ జంట తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఎప్పుడైతే పరిశ్రమ రష్మికకు ఘనస్వాగతం పలికిందో, అప్పుడు ఆమెకు కెరీర్​ గురించిన  ఆలోచన  మొదలైంది. సినిమాల మీద దృష్టి పెట్టాలని కోరుకుంది, కానీ రక్షిత్ కుటుంబం ఆ నిర్ణయాన్ని అంగీకరించలేదని, కుటుంబ జీవితానికి కట్టుబడిఉండాలని కోరుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఇద్దరూ పరస్పర గౌరవంతో దూరమయ్యారు.

మలి ప్రేమ నిశ్శబ్ద భావోద్వేగం

రష్మిక వ్యక్తిగత జీవితంలో ఆ మానసిక వ్యధ అలాగే ఉండిపోయింది. అప్పుడు ఆమెకు అండగా నిలిచిన వ్యక్తి విజయ్ దేవరకొండ. “గీతగోవిందం” (2018), “డియర్ కామ్రేడ్‌” (2019) సినిమాల్లో వీరిద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ తెరపై మాత్రమే కాదు, తెర వెనుక కూడా జీవం పోసుకుందనే ప్రచారం మొదలైంది. వారి రహస్య పర్యటనలు, కలిసిన వేడుకలు, సామాజిక మాధ్యమాల్లో కనబడిన సాన్నిహిత్యం — ఇవన్నీ అభిమానుల్లో కొత్త ఊహాగానాలకు దారి తీశాయి.

ఇప్పుడు ఇరువురి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, అక్టోబర్‌ 3న చెన్నైలో వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎవరూ బయటకు ఫోటోలు రిలీజ్ చేయకపోవడంతో ఈ న్యూస్‌ ఇంకా మిస్టరీగా మారింది. మరింత ఆసక్తికరమేమిటంటే :

రష్మికకు రెండు సార్లు నిశ్చితార్థం అయిన తేదీ ఒకటే — “3వ తేది”!

ఇక వారి మిత్రులు చెబుతున్న మేరకు,విజయ్–రష్మిక పెళ్లి ఫిబ్రవరి 2026లో జరగబోతుందట. కుటుంబ స్థాయిలో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, డెస్టినేషన్ వెడ్డింగ్ ఆలోచన కూడా ఉందని వార్తలు చెబుతున్నాయి. ఇద్దరి చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయ్యాకే అధికారిక ప్రకటన రావచ్చని అంచనా.

అయితే ఈ శుభవార్తల మధ్య కొన్ని పాత గాయాలు మళ్లీ సోషల్ మీడియాలో రేగుతున్నాయి. రష్మిక–రక్షిత్ జంట విడిపోయిన తర్వాత కూడా, కొన్ని వర్గాలు ఆమెను నిత్యం టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆమె నిశ్చితార్థ వార్త వెలుగులోకి రాగానే, పాత ఫొటోలు, కామెంట్లు, విమర్శల వర్షం తిరిగి మొదలైంది. అయినా రష్మిక ఎప్పటిలాగే తన హుందాతనాన్ని నిలబెట్టుకుంది. రక్షిత్ కూడా తాను ముందుకు సాగిపోయినట్లు, ఎవరి జీవితంలో వారు సౌకర్యంగా ఉన్నట్లు పబ్లిక్‌గా చెప్పాడు. ఇద్దరూ వ్యక్తిగతంగా విజయం సాధించినప్పుడు, వారిని కిందకు లాగడానికి ప్రయత్నించే నెగెటివ్ సోషల్ ఎలిమెంట్లే ఈ కథలో నిజమైన విలన్లుగా మారాయి.

రష్మిక ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తుకుతెచ్చుకోవాలి:

“నా జీవితంలో ఉన్నవారు నన్ను ధృడంగా మార్చారు. బాధ కూడా నాకు ధైర్యం నేర్పింది. అందుకే నేను ఎవరి మీదా అసహనం ప్రదర్శించను.”

ఈ కథలో ప్రేమ, బాధ, గౌరవం, పడి లేచిన ఆత్మస్థైర్యం అన్నీ ఉన్నాయి. రక్షిత్‌తో మొదలైన ప్రేమ కథ ఇప్పుడు విజయ్‌తో పెళ్లికానుకగా మారబోతోంది. ఇది ఒక నటి వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు, తన ఎదుగుదల వెనుక ఉన్న నిజమైన భావోద్వేగాల గాథ కూడా. తెలుసుకోవాల్సింది ట్రోలింగ్ చేస్తున్న యాంటీ ఫ్యాన్స్​ ​. నటీనటులు కూడా మనుషులే. వారికి కూడా వ్యక్తిగత జీవితాలుంటాయి, బంధాలు, అనుబంధాలు, భావోద్వేగాలుంటాయి. ఎవరికి నచ్చిన బంధాన్ని వారెన్నుకునే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. మనలాగే..