Site icon vidhaatha

Varalakshmi| మ‌ల్లెమాల అధినేత శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి భార్య క‌న్నుమూత‌..!

Varalakshmi| ఇటీవ‌ల సినిమా ప‌రిశ్ర‌మ‌లో అనేక విషాదాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలోనే ప్రముఖ తెలుగు నిర్మాత, మల్లెమాల ఎంటర్‌టైనమెంట్స్‌ అధినేత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మి (62) కేన్సర్‌తో బాధపడుతూ క‌న్నుమూసారు. ఆమె మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు. అయితే శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి భార్య వరలక్ష్మి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి కూతురు అన్న విష‌యం విదిత‌మే.

ప్రముఖ సినీ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూతురైన వరలక్ష్మిని వివాహం చేసుకోగా, వారి వైవాహిక జీవితంలో ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి అమెరికాలో త‌న విద్యాభ్యాసం పూర్తి చేసి ఇండియాకి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కి సినిమాల‌పై ఎక్కువ ఆస‌క్తి ఉండ‌డంతో నిర్మాత‌గా మారారు. ముందుగా కోదండరామిరెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఆయ‌న ఆ తర్వాత పీఎం రామచంద్రరావు ప్రొడక్షన్ హౌస్ లో ప్రొడక్షన్స్ నేర్చుకుని 18 రోజుల నిర్మాణ వ్య‌వధిలో తలంబ్రాలు అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.

నిర్మాత‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్న శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి జబర్దస్త్ కార్యక్రమానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ఎంత పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ షోతో పాటు ఢీ డాన్స్ జోడి షో కి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా జీన్స్, అదుర్స్ , క్యాష్ , స్టార్ మహిళ వంటి కార్యక్రమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈయ‌న నిర్మించిన సినిమాలు చూస్తే…. అమ్మోరు, అరుంధతి, అంజి లాంటి చిత్రాలు ఆయ‌న టేస్ట్‌కి అద్దం ప‌డ‌తాయి. చిరంజీవి హీరోగా వచ్చిన అంజి సినిమా కథపరంగా డిజాస్టర్ అయినా ఇందులో గ్రాఫికల్ ఎఫెక్ట్స్ కి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డు కూడా లభించింది.

Exit mobile version