Tourist Family Director Abishan Jeevinth | విధాత : చలన చిత్ర రంగంలో దర్శకులు హీరోలుగా..హీరోలు దర్శకులు మారడం సాధారణంగా చూస్తుంటాం. తాజాగా ఈ బాటలో మరో తమిళ దర్శకుడు కూడా హీరోగా మారిపోయాడు. ఈ ఏడాది దర్శకుడు అభిషన్ జీవింత్(Abishan Jeevinth) తన డెబ్యూ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’(Tourist Family) మూవీతో బాక్సాఫీస్ హిట్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కేవలం రూ.7 కోట్లతో చిన్న సినిమాగా విడుదలైన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఊహించని విజయంతో రూ.90 కోట్లు వసూలు చేసి నిర్మాతకు 1200 శాతం లాభాలను అందించింది. ఈ క్రమంలో అభిషన్ జీవింత్ తదుపరి చిత్రం ఏమిటన్నదానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా ఈ యువ దర్శకుడు మెగా ఫోన్ పక్కన పట్టేసి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
మదన్ దర్శకత్వంలో సౌందర్య రజనీకాంత్(Soundarya Rajinikanth) నిర్మాణ సంస్థ జియాన్ పిక్చర్స్(Zion Pictures), ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్స్(MRP Entertainments) సంయుక్తంగా నిర్మించనున్న సినిమాతో అభిషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందులో అభిషన్ కు జంటగా మలయాళ నటి అనశ్వర రాజన్(Anaswara Rajan) ఎంపికయ్యారు. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మూవీలో ఓ కీలక పాత్రను పోషించి మెప్పించిన అభిషన్ తనలో మంచి నటుడు ఉన్నాడని చాటాడు. ఆ సినిమాలో అతని నటనా సామర్ధ్యాన్ని గుర్తించిన సౌందర్య రజనీకాంత్ తన సంస్థ నిర్మాణంలో అభిషన్ హీరోగా సినిమాను ప్రకటించడం విశేషం. ఈ చిత్రంలో అభిషన్ ‘సత్య’ అనే పాత్రలో, అనశ్వర ‘మోనిష’ అనే పాత్రలో కనిపించనున్నారని వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని చిత్రబృందం స్పష్టం చేసింది.
