మక్కల్ సెల్వన్(Makkal Selvan)గా తమిళ ప్రేక్షకులు ఆరాధించే నటుడు విజయ గురునాథ సేతుపతి కాలిముత్తు అలియాస్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi). ఈ మధ్య విడుదలైన మహారాజ(Maharaja) చిత్రంలో అద్భుతమైన నటన ప్రదర్శించిన విజయ్, దేశం మొత్తం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. దుబాయ్‌లో చిన్న అకౌంటెంట్‌గా పనిచేస్తున్న విజయ్, సినిమాల మీద ఉన్న విపరీతమైన ఆసక్తితో మద్రాస్‌కు తిరిగివచ్చాడు. మొదట చిన్నాచితక పాత్రలు చేసిన సేతుపతి, సుందరపాండ్యన్(Sundarapandyan), పిజ్జా(Pizza) సినిమాలతో అమాంతం వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత కథ మనక్కూడా తెలిసిందే. 96, పేట, విక్రమ్, మాస్టర్, జవాన్, ఉప్పెన, సైరా నరసింహారెడ్డి నుండి మొన్నటి మహారాజ వరకు తన నట విశ్వరూపాన్ని చూపించాయి. విక్రమ్(Vikram)లోనైతే కమల్‌హాసన్(Kamal Haasan)తో నటనలో సమఉజ్జీగా నిలిచాడు.
నటుడిగా నిలదొక్కుకునేంతవరకు కూడా విజయ్ సేతుపతి చాలా కష్టాలననుభవించాడు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కుంగుబాటు(Depression)కు లోనయ్యే విజయ్ సేతుపతి, తన డిప్రెషన్‌కు మందేంటో చెప్పాడు. అదేంటో తెలుసా? తెలుగు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘అతడు’(Mahesh Babu’s ATHADU) సినిమా.
2005లో విడుదలైన అతడు తెలుగు క్లాసిక్ యాక్షన్ సినిమాగా పేరుగాంచింది. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ కానప్పటికీ, టీవీల్లో మాత్రం ఇప్పటికీ దుమ్మురేపుతునేఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్(Director Trivikram Srinivas) దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ఆయన పేరు మారుమోగిపోయింది. అప్పటిదాకా రచయితగానే ఉన్న త్రివిక్రమ్ ఒక్కసారిగా టాప్ దర్శకులలో ఒకడిగా మారిపోయాడు. అద్భుతమైన కథనం, సరిగ్గా కుదిరిన పాత్రలు, అవసరానికి మించని మాటలు, వినసొంపైన పాటలలో అతడు తెలుగు సినిమాలో ఓ చరిత్ర సృష్టించింది. ఇప్పుడు వేల కోట్లు వసూలు చేస్తున్న సినిమాలకంటే వందల రెట్లు గొప్ప సినిమా. మహేశ్‌బాబును పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా మార్చేసిన చిత్రమిది.
ఇక విజయ్ సేతుపతి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ(In an Interview)లో మాట్లాడుతూ, తను ఎదగడానికి ప్రయత్నిస్తూ, కష్టపడుతున్న రోజుల్లో తనకు స్ఫూర్తి(Inspiration)నిచ్చిన సినిమా అతడు అని చెప్పారు. ఆ సినిమా టైటిల్స్ దగ్గర్నుంచీ ఎండ్ కార్డ్ దాకా ప్రతీ సీన్ విపరీతంగా నచ్చిందని, బ్రహ్మానందం హాస్య సన్నివేశాలు ఎంతో బాగుంటాయని ప్రశంసించారు. త్రిష(Trisha krishnan)తో రొమాన్స్, మహేశ్‌బాబు(Mahesh Babu) స్క్రీన్ ప్రజెన్స్ , విలన్స్ అందరూ, అన్నీ బాగా కుదరిన సినిమా అదని, అలా అన్నీ ఉండలేవని సేతుపతి కొనియాడారు. త్రివిక్రమ్ కథను రాసుకున్న తీరు కంటే, దాన్ని తెరమీదకు తీసుకొచ్చిన విధానం అద్భుతంగా ఉందని చెప్పిన విజయ్ సేతుపతి, ఇప్పటికే ఎన్నోసార్లు చూసినా కూడా ఇప్పుడు మళ్లీ చూస్తే కూడా కొత్తగా, అంతే ఎంజాయ్ చేసేలా అతడు ఉంటుందని తెలిపారు.
తానే పెద్ద హీరో అయి ఉండీ, ఇంకో హీరో సినిమా గురించి ఇంత గొప్పగా మాట్లాడటం విజయ్ సేతుపతికే సాధ్యమని నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందులోనూ మహేశ్ అభిమానులైతే ఇక చెప్పనవసరం లేదు.