Prithvi Raj | కమెడియన్‌ పృథ్వీరాజ్‌కు ఊరట.. ఆ కేసును కొట్టివేసిన విజయవాడ కోర్టు..!

Prithvi Raj | టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ పృథ్వీరాజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాడు. అయితే, నటుడికి విజయవాడ కోర్టు ఊరటనిచ్చింది.

Prithvi Raj | టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ పృథ్వీరాజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాడు. అయితే, నటుడికి విజయవాడ కోర్టు ఊరటనిచ్చింది. అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఆయన భార్య శ్రీలక్ష్మి పెట్టిన కేసును విజయవాడ రెండో అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు కొట్టివేసింది. విచారణలో పృథ్వీరాజ్‌పై నేరారోపణలు రుజువు కాలేదు. దీంతో కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి మాధవీదేవి తీర్పును వెలువరించారు. విచారణ కోసం నటుడు పృథ్వీ బుధవారం విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. కాగా అదనపు కట్నం కోసం పృథ్వీరాజ్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ భార్య శ్రీలక్ష్మి 2016లో కేసు పెట్టారు. ఈ కేసుపై 2017లో రెండో ఏసీఎంఎంలో ఛార్జిషీట్‌ దాఖలైంది.

అప్పటినుంచి వాదనలు కొనసాగుతుండగా.. బుధవారం తుదితీర్పును వెలువరించింది. పెళ్లి సమయంలో డబ్బు, బంగారు నగలు ఇచ్చినా ఇంకా అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తున్నారని శ్రీలక్ష్మి ఆరోపించారు. సినిమాల్లో నటించే ఆయన హైదరాబాద్‌‌ వెళ్లిన తర్వాత వ్యసనాలకు అలవాటు పడ్డారని, తనను పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు విజయవాడలోని సూర్యారావుపేట స్టేషన్‌లో సెక్షన్‌ 498ఏ కింద వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఇదిలా ఉండగా.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు.. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితతో 1984లో వివాహమైంది.

ఈ దంపతులకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. విభేదాలతో కొన్నేళ్లుగా పృథ్వీరాజ్‌ భార్యతో విడిగా ఉంటున్నారు. శ్రీలక్ష్మీ పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉంటుంది. వివాదాల నేపథ్యంలో శ్రీలక్ష్మి 2017లో కోర్టును ఆశ్రయించారు. తన భర్త నుంచి తనకు నెలకు రూ.8 లక్షల భరణం ఇప్పించాలని కోరారు. అంతేకాకుండా పృథ్వీరాజ్‌ విజయవాడలో తన అమ్మవాళ్ల ఇంట్లో ఉంటూనే చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నీ తమ తల్లిదండ్రులే భరించారని ఆమె కోర్టుకు తెలిపారు. అయితే, సినిమాల్లోకి వెళ్లాక పృథ్వీరాజ్ తనను తరచూ వేధించేవాడని, ఇదే క్రమంలో తనని 2016 ఏప్రిల్‌ 5న ఇంట్లో నుంచి బయటకు పంపాడని ఆరోపించారు. అందుకే తాను తన పుట్టింటికి వచ్చి ఉంటున్నానని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.