బాహుబలి1,2, సాహో, రాధేశ్యామ్, కల్కి లాంటి భారీ సినిమాలు, సీరియస్ కథాంశాలతో పాన్ఇండియా స్థాయికి చేరుకున్న ప్రభాస్ను వెనుకటి ప్రభాస్లా చూడలేకపోతున్నామనే బాధ అభిమానుల్లో ఓ మూల ఉండనైతే ఉంది. అదీ కాక, ఇలాంటి సినిమాల వల్ల ఒక్కో సినిమా మూడేళ్లకు విడుదలవడం కూడా అభిమానులను కలవరపెడుతోంది. దీన్ని గమనించిన ప్రభాస్ స్పీడు పెంచాడు. ఇప్పుడు ధనాధన్ షూటింగులతో చేతిలో మూడు సినిమాలతో గత్తర లేపుతున్నాడు. ఫౌజీ, స్పిరిట్, రాజాసాబ్, సలార్–2 సినిమాలతో తీరిక లేకుండా షూటింగుల్లో పాల్గొంటున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల పరాజయం ఆయన్ను ఆలోచనలో పడేసాయి. అవి షూటింగ్లకే మూడునాలుగేళ్లు తీసుకుని, తీరా విడుదలై ఘోర పరాజయం మూటగట్టుకుంటే, మరో మూడేళ్ల దాకా ఇంకే సినిమా లేకపోతే ఎలా ఉంటుంది? దాంతో రూటు మార్చిన రెబల్స్టార్, ఈసారి ఫక్తు హర్రర్ కామెడీతో ముందుకువస్తున్నాడు. ప్రేమకథాచిత్రమ్తో ఓ విచిత్రమైన నవ్వు,భయం కలగలిపిన సినిమా తీసిన మారుతితో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి, పాత ప్రభాస్లా ముందుకెళ్లాడు. ఇది కూడా షూటింగ్ ప్రారంభించుకుని చాలా రోజులైంది. అయినా, ఒక లైటర్వేన్ కథాంశంతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ , కామెడీ కలిసిఉండేలా చూసుకున్నాడు. నాయికలుగా కత్తుల్లాంటి నిధి అగర్వాల్, మాళవికా మీనన్లను తీసుకున్నారు. మొత్తానికి టీజర్ చూసినవారికి కావాల్సినంత వినోదాన్ని, భయాన్ని పంచాడు.
ఇంతకీ ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఏమిటనేదే ఇప్పుడు ఫ్యాన్స్ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. టీజర్ చూసిన తర్వాత సంజయ్దత్ ముసలి దయ్యంలా కనిపించి, ఫోటోలో ప్రభాస్ వృద్ధవేషంలో కనిపించి, అసలు ప్రభాస్ దయ్యం తాత అని ఎవరిని సంభోదించాడో తెలియడం లేదు. ముసలి ప్రభాస్ కూడా దయ్యమేనా? అయితే సంజయ్దత్కు, ప్రభాస్కు ఉన్న సంబంధమేంటి? అనేది ప్రభాస్ అభిమానుల సోషల్ మీడియాలలో పెద్ద చర్చ మొదలైంది. ఇంకా ప్రభాస్ ఈ సినిమాలో డబుల్ యాక్షన్ చేస్తున్నాడనేది మరో వార్త. సరే.. ఫోటోలో ముసలివేషంలో కూడా కనబడ్డాడు కాబట్టి, అనుకోవచ్చు. ఇప్పుడు బయటపడ్డ మరో నిజం ఏంటంటే, అసలు ప్రభాస్ డబుల్ ఫోజు లేనేలేదట. తాత ఆత్మే ప్రభాస్ను ఆవహించినపుడు అలా ఫోటోలో ఉన్నట్లు కనబడతాడని ఒక రూమర్.
ఏదేమైనా, టీజర్ నవ్వులను, భయాన్ని సమానంగా పంచడంతో అభిమానులు పరమానంద భరితులవుతున్నారు. ఈ రకమైన డిస్కషన్లతో సోషల్ మీడియా నిండిపోవడం, కామెడీ బాగా ఉంటుందని తెలియడంతో ఫ్యామిలీలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ అంశాలన్నీ రాజసాబ్కు ప్లస్పాయింట్లేననేది ఖచ్చితమైన విషయం. కల్కి విజయం తర్వాత ఒక సింపుల్, కూల్ , కామెడీ సినిమా హిట్ అవుతుందనే సూచన, ప్రభాస్కు చాలా మంచిది కూడా.