Adharva / National News / 18 July 2025
Nimisha Priya case | పెద్ద మనసుతో, చిన్న గ్రామం నుంచి గుండె నిండా ఆశలతో వెళ్ళిన ఒక భారతీయ నర్సు… పరాయి దేశంలో ప్రాణదండనకు గురవుతున్న విషాదకథ… ఇది నిమిష ప్రియ జీవితం. పాలక్కాడ్ జిల్లాలోని కొల్లంగోడ్ గ్రామానికి చెందిన నిమిష, చిన్ననాటి నుంచే చదువులో మంచి ప్రతిభ కనబర్చేది. స్థానిక చర్చి మద్దతుతో నర్సింగ్ చదువుకున్న ఆమె, 2008లో ఉద్యోగార్థిగా యెమెన్ దేశానికి వెళ్లింది. తొలుత ప్రభుత్వ దవాఖానలో ఉద్యోగం చేసిన ఆమె, 2014లో తన సొంత ఆసుపత్రిని నెలకొల్పింది. దీనికోసం తలాల్ అబ్దో మహ్దీ అనే స్థానిక వ్యాపారిని భాగస్వామిగా తీసుకోవాల్సి వచ్చింది — ఇది అక్కడి చట్టాల ప్రకారం తప్పనిసరి.
అయితే ఈ భాగస్వామ్యంనిమిష భవిష్యత్తును తారుమారు చేసింది. నిమిష వాదన ప్రకారం, తలాల్ ఆమె డబ్బుకాజేసాడు, శారీరకంగా హింసించాడు, పాస్‌పోర్ట్ సహా ఆమె కీలక డాక్యుమెంట్లను లాక్కున్నాడు.నిమిష తన భార్య అంటూ అక్రమంగా ప్రచారం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా, స్పందన లేదు. చివరికి 2017లో, తన పాస్‌పోర్ట్ తిరిగితీసుకోవాలనే ఉద్దేశంతో అతనికి కేటమైన్ అనే మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చింది. దురదృష్టవశాత్తు మోతాదు అధికం కావడంతోఅతను మరణించాడు.దిక్కుతోచని నిమిష దేశం విడిచి పారిపోయే ప్రయత్నంలో యెమెన్–సౌదీ అరేబియా సరిహద్దు వద్ద అరెస్ట్ చేశారు.
అరబిక్‌లో నడిచిన విచారణ, అనువాదకుడు లేకుండా, న్యాయ సహాయం అందకుండా, ఆమెకు ఉరిశిక్ష విధించబడింది. ఈ విషయాన్ని భారత న్యాయవాదులు, మానవహక్కుల సంస్థలు తీవ్రంగా విమర్శించాయి. 2018లో మొదటి సారి శిక్ష పడగా, 2020లో మళ్లీ అదే తీర్పు. 2023లో యెమెన్ సుప్రీం జుడిషియల్ కౌన్సిల్ కూడా దాన్ని ఖరారు చేసింది.దాంతో, 2025 జూలై 16న నిమిషకు ఉరిశిక్ష అమలు చేయాలని నిర్ణయించారు.
అయితే ఆఖరి క్షణంలో,మృతుడు తలాల్ కుటుంబం ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం రావడంతో, ఎగ్జిక్యూషన్ వాయిదా పడింది. ఈ సడలింపు తాత్కాలికమే అయినా,నిమిష కుటుంబానికి, మద్దతుదారులకు ఊరట కలిగించింది. ఈ నేపథ్యంలో ‘దియత్’ అనే ఇస్లామిక్ చట్టం కీలకం అయ్యింది. ఇది హత్య కేసుల్లో బాధిత కుటుంబానికి నష్టపరిహారంగా డబ్బు చెల్లించి శిక్ష మాఫీ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది.నిమిష కుటుంబం, మద్దతుదారులు 58,000 అమెరికన్ డాలర్లు (అంటే సుమారు రూ. 48 లక్షలు) వరకూ సేకరించారు. ఇందులో సగ భాగాన్ని సనా నగరంలోని భారత దౌత్య కార్యాలయానికి బదిలీ చేశారు. అదే సమయంలో భారత ముస్లిం మతపెద్ద అయిన కాన్థాపురం ఎ.పి. అబూబాకర్ ముస్లియార్ కూడా కలుగజేసుకుని, యెమెన్ మతపెద్దల సహాయంతో తలాల్ కుటుంబంతో చర్చలు జరిపారు. “ శిక్షకు బదులుగా బ్లడ్ మనీ (దియత్) తీసుకోవడం కూడా ఇస్లాంలో ఉంది. వారిని దానికి అంగీకరించాలని నేను అభ్యర్థించాను,” అని ఆయన పేర్కొన్నారు.
అయితే, తలాల్ సోదరుడు అబ్దెల్‌ఫతాహ్ మహ్దీ ఫేస్‌బుక్‌లో వెల్లడించిన ప్రకారం — “ప్రతీకారం తప్ప మేము ఏదీ కోరుకోవడం లేదు. ఒత్తిళ్లతో మారం. శిక్ష అమలు కావాలనే మా డిమాండ్.” అని స్పష్టం చేశారు.ఈ సమయానికి భారత ప్రభుత్వం కూడా అన్ని అవకాశాలను వెతుకుతోంది. కాని యెమెన్‌లోని సనా నగరం హౌతీ తిరుగుబాటుదారుల చేతుల్లో ఉండడం వల్ల అధికారిక మార్గాల్లో మధ్యవర్తిత్వం అసాధ్యం. అయినా, ప్రైవేట్ చర్చలు, మానవీయ పరంగా తీసిన ప్రయత్నాల వల్ల నిమిషకు తాత్కాలిక ఊరట లభించింది.
ప్రస్తుతంనిమిష తల్లి సనా నగరంలో ఉంటూ, తలాల్ కుటుంబంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఆమె విడుదల కావాలంటే, తలాల్ కుటుంబం ‘దియత్’కు అంగీకరించాల్సిందే. లేదంటే శిక్ష అమలవుతుంది.
ఈ కేసు, శాస్త్రబద్ధంగా చూసినపుడు — ఇది న్యాయ వ్యవస్థ, మానవ హక్కులు, మహిళా సాధికారత మరియు వలస ఉద్యోగుల భద్రత వంటి అనేక అంశాలకు ఉదాహరణలా మారింది. ఒక పారిశ్రామిక దేశం నుంచివెళ్లిన మహిళ, పరాయి దేశంలో అక్కడి న్యాయాన్ని అర్థం చేసుకోలేక, భాషా సమస్యల మధ్య, బతికే అవకాశాన్ని కోల్పోతున్న దుస్థితి ఇది.
నిమిష ప్రియజీవితం కోసం ఓ కుటుంబం, ఓ దేశం, మతపెద్దలు, మానవ హక్కుల కార్యకర్తలు పోరాడుతున్నారు. కానీ చివరకు, ఆమెకు క్షమాభిక్ష లభించబోతుందా? లేక చట్టం తనదైన తీర్పు నెరవేర్చబోతుందా? అనేది ఈ ప్రపంచం చూడబోతోంది.