Margashira Masam Begins Today: Significance, Rituals and Sacred Days Explained
పుణ్యప్రదంగా, శ్రేయస్సును ప్రసాదించే మాసంగా ప్రశంసించబడే మార్గశిరం ధర్మాచరణ, దాన–ధర్మాలు, భక్తి భావనను పెంపొందిం చడానికి అత్యంత అనుకూల సమయం. ఈ మాసాన్ని శాస్త్రోక్తంగా ఆచరించినవారికి ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం, మోక్షప్రాప్తి వంటి మహా ఫలాలు లభిస్తాయని పురాణాలు కూడా పేర్కొంటాయి.
(విధాత ఆధ్యాత్మికం డెస్క్)
Margashira Masam | చాంద్రమాన పంచాంగంలో అత్యంత పవిత్రంగా చెప్పబడే హేమంత ఋతువు ప్రారంభ మాసం — మార్గశిర మాసం. మృగశిర నక్షత్రంతో కలిసిన పౌర్ణమి తర్వాత వచ్చే ఈ నెలను విష్ణురూపమైన మాసంగా శాస్త్రాలు వర్ణిస్తాయి.
ప్రకృతిలో తుషార బిందువులు మెరిసే హేమంత శోభ, భక్తిలో పుణ్యప్రభలు కలిసి వెలుగొందే మాసం ఇది. శ్రీకృష్ణుడు కూడా “మాసానాం మార్గశీర్షోఽహమ్ (మాసాలలో మార్గశిరాన్ని నేనే)” అని గీతలో చెప్పినందున, ఈ మాసం మహా పుణ్యప్రదమైనదిగా భావించబడుతుంది.
పూజలు, దానాలు, తులసీ ఆరాధన, తెల్లవారుఝామున స్నానం—ఇవి అన్నీ ఈ మాసంలో అత్యంత శ్రేయస్సు కలవిగా శాస్త్రాలు సూచిస్తున్నాయి.
మార్గశిర మాసం విశిష్టతలు – పవిత్ర స్నానాలు
ఈ మాసాన్ని ముక్తికి మార్గం అని కూడా పిలుస్తారు. ప్రతీ రోజు బ్రాహ్మీముహూర్తంలో స్నానం చేయడం, సంధ్యావందనం, జపం–ధ్యానం వంటి ఆచారాలు ఆరోగ్యానికి, మానసిక శాంతికి, ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేస్తాయి.
శాస్త్రం ప్రకారం ఈ మాసంలో:
- బ్రాహ్మీముహూర్తంలో స్నానం చేస్తే చలిబాధ ఉండదు
- ఆ సమయంలో నీటిలో సూర్య–అగ్ని తేజసులు కలిసే ఉంటాయి
- నదీస్నానం చేసి దీపం విడిచిపెడితే ఆరోగ్యం–సంపదలు ప్రసాదిస్తాయి
మార్గశిరం అంతా శ్రీమహావిష్ణువును తులసీ దళాలతో పూజించడం అత్యంత పుణ్యప్రదం. ప్రతి ద్వాదశినాడు పంచామృత అభిషేకం చేయాలని శాస్త్రం సూచిస్తుంది. అలాగే ఈ మాసమంతా ఏ పనిని చేసినా “ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని జపిస్తూ చేయాలని పెద్దలు పునరుద్ఘాటిస్తారు.
పుణ్యదినాలు, ఉపవాసాలు, ఆచారాలు
వైకుంఠ ఏకాదశి : మార్గశిర శుద్ధ ఏకాదశి — వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర తిథి. ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా విష్ణు దర్శనం చేస్తే మోక్షప్రాప్తి అన్నది భక్తుల విశ్వాసం. తిరుపతి, శ్రీరంగం వంటి క్షేత్రాల్లో ఈ రోజు మహా ఉత్సవం జరుగుతుంది.
స్కంద షష్ఠి (సుబ్రహ్మణ్య షష్ఠి) – ఈ రోజున కుమారస్వామి తారకాసురుని సంహరించినట్లు శాస్త్రాలు పేర్కొంటాయి.
మోక్షదా ఏకాదశి – గీతాజయంతి.. ఈ మాసంలోనే భగవద్గీత భూమికి అవతరించింది. సమస్త మానవాళికి ధర్మ మార్గాన్ని చూపిన రోజు ఇది.
దత్తాత్రేయ జయంతి – త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్యస్వరూపుడు దత్తాత్రేయుడు. అతని జన్మదినం మార్గశిర శుక్ల పౌర్ణమి.
ఇతర ముఖ్య తిథులు
ఈ మాసంలోనే అనేక పుణ్యదినాలు— అనంత తృతీయ, నాగపంచమి, పరశురామ జయంతి, సంకటహర చతుర్థి, కాలభైరవాష్టమి, సఫలా ఏకాదశి, యమదర్శన త్రయోదశి, ప్రదోషం వంటి ఎన్నో శుభతిథులు వస్తాయి.
ధనుర్మాసం ప్రారంభం
మార్గశిరంలోనే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశిస్తాడు. ఈ ధనుస్సంక్రాంతి ధనుర్మాసానికి ఆరంభం. తిరుప్పావై పారాయణాలు, విష్ణు ఆరాధన, సుశుభఫలాలు ఈ కాలంలో మరింత ప్రజ్వరిల్లుతాయి.
