Ugadi 2024 | శోభకృత్ నామ సంవత్సరంలో సోమవారం ఆఖరి రోజు. ఫాల్గుణ మాసం బహుళపక్ష అమావాస్య తిథిలో సుదీర్ఘ సంపూర్ణం ఏర్పడబోతోన్నది. పంచాంగరీత్యా రేవతి నక్షత్రం, మీనరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు తెలిపారు. గ్రహణం భారతదేశంలో కనిపించడం లేదు. దాంతో గ్రహణ సూతకం వర్తించదని పేర్కొన్నారు. గ్రహణం నేపథ్యంలో ఉగాది పండగపై ఏమైనా ప్రభావం పడుతుందా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. వాస్తవానికి గ్రహణం సోమ-మంగళవారాల మధ్య నాలుగు గంటలకుపైగా కొనసాగుతుంది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కెనడా, ఐరోపా తదితర దేశాల్లో కనిపించబోతున్నది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు మొదలై 2.30 గంటల తర్వాత ముగుస్తుంది. అయితే, యథావిధిగా పండుగను జరుపుకోవచ్చని.. ఆలయాలను మూసివేయాల్సిన అవసరం ఉండదని పండితులు పేర్కొన్నారు.
అయితే, ఈ సంపూర్ణ సూర్య గ్రహణం రేవతి నక్షత్రం మీన రాశిలో ఏర్పడుతున్నది. మీనరాశిలో రవి, చంద్ర, శుక్ర, రాహువులు ఉండడంతో ఇతర దేశాల్లో ఉండే మీనరాశి జాతకులు గ్రహణం చూడకుండా ఉండడం మంచిది. సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తులు గ్రహణ సమయంలో సూర్యారాధన, దుర్గాదేవి ఆరాధన, గ్రహణ శాంతి చేయడం వల్ల గ్రహదోషాలు తొలుగుతాయని తెలిపారు. మీనరాశిలో గ్రహణం ఏర్పడడం కారణంగా పశ్చిమ దేశాలకు అరిష్టాన్ని సూచిస్తోందని.. పశ్చిమదేశాలలో నివసించే వ్యక్తులు అసహనానికి లోనవడం, రాజకీయ అనిశ్చితి ఏర్పడడం, జనాలమధ్య ఆవేశంతో గొడవలు కలగడం, యుద్ధ వాతావరణం, యుద్ధ భయాలు నెలకొంటాయని జ్యోతిష్య పండితులు పేర్కొన్నారు. ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని పండితులు వివరించారు.