Site icon vidhaatha

విజయ్ దేవరకొండ ఓకే అంటే.. ఆ హీరోయిన్‌పెళ్లి కూడా చేసుకుంటుందట!

విధాత‌: విజయ్ దేవరకొండ.. ఈ పేరు వింటే కొత్తతరం ప్రేక్షకులకు అదో క్రేజ్. యువతకు ఆయ‌న స్టైలిష్ స్టార్ అయితే యువతులకు మాత్రం ఆయన డ్రీమ్ బాయ్. వారికి ఆయనంటే క్రష్. ఒక విధంగా అందరికీ కలల రాకుమారుడు అని చెప్పాలి. ఆయన స్టైలే డిఫరెంట్. అందుకే తనదైన యాటిట్యూడ్‌లో ఆయన మాట్లాడుతూ ఉంటే తప్పుపట్టే వారి కంటే చప్పట్లు కొట్టే వారే ఎక్కువ.

ఆయన యాటిట్యూడ్‌కి తోడు ఆయన పర్సనాలిటీ కూడా నేటి జనరేషన్ అమ్మాయిలకు విపరీతంగా నచ్చుతోంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ.. అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోలకు పోటీ ఇచ్చే రేంజ్‌కి ఎదిగిపోయాడు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో ఓ చిన్న పాత్ర ద్వారా పరిచయమయ్యాడు. వాస్తవానికి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో నటించి వెండితెర‌కు ప‌రిచయమైన మిగిలిన ఆర్టిస్టులు పెద్దగా పాపులర్ కాలేదు.

హ్యాపీడేస్ తో పోల్చుకుంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం కొత్తవారికి తెచ్చిన గుర్తింపు తక్కువే. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అశ్విని దత్ కూతురు నిర్మించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంలో నానికి సపోర్టింగ్ రోల్‌లో నటించాడు. ఈ చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది.

వాస్తవానికి ఈ చిత్రం ద్వారానే లైమ్ లైట్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి చూపులు’ చిత్రం యూత్‌లో మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. అప్పటివరకు ఒక లెక్క.. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ చిత్రం విడుద‌ల‌ తర్వాత విజయ్ దేవరకొండ అంటే మరో లెక్క.

వాస్తవానికి ఈ చిత్రాలు కంటే ముందు ఆయన ద్వారక అనే చిత్రంలో హీరోగా 2017లోనే ఎంట్రీ ఇచ్చాడు. అర్జున్ రెడ్డితో ఆయన తన నటన విశ్వరూపం చూపించి యువతకు రోల్ మోడల్ అయ్యాడు. అది మంచిగా కానీ చెడుగా కానీ… ఆయనకు వచ్చిన గుర్తింపును మాత్రం ఎవ్వరు కాదనలేరు. ఆయన రేంజ్ పీక్స్‌కి వెళ్ళింది. అదో పెద్ద సంచ‌ల‌నం.

దీని త‌ర్వాత గీతా ఆర్ట్స్‌లో ఆయ‌న న‌టించిన ‘గీతా గోవిందం’ చిత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ డ‌మ్‌ని వ‌న్ మూవీ వండ‌ర్ కాద‌ని నిరూపిస్తూ ఆయ‌న స్టార్ స్టేట‌స్‌ను ప‌దిలం చేసింది. ఆ తర్వాత నోటా నిరాశపర్చిన కూడా టాక్సీవాలాతో మరో చక్కని విజయం అందుకున్నాడు.

ఇక అర్జున్ రెడ్డి చిత్రం విజయ్ దేవరకొండకు స్టార్ స్టేటస్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. వివిధ భాషల్లో రీమేక్ అయినప్పటికీ ఆయా ప్రేక్షకులందరూ తెలుగు అర్జున్ రెడ్డిని వెతికి మరీ యూట్యూబ్లో చూసేశారు. దాంతో ఆయనపై మ‌న‌సు పారేసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇప్పుడు అన్నిచోట్ల విజయ్ దేవరకొండ ఒక సెన్సేషన్‌. యూత్‌లో అద్భుతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. టాక్సీవాలా కంటే ముందు నోటాతో అపజయం ఎదుర్కున్నా.. ఆ తర్వాత కూడా వరుసగా డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగ‌ర్ అంటూ వ‌రుస ప‌రాజ‌యాలు ఆయనకు ఎదురయ్యాయి.

కానీ ఆయనకు అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తెచ్చిన క్రేజ్ చూస్తే ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా తరిగిపోని రేంజ్ స్టార్ స్టేటస్ ని ఆయన సంపాదించాడని చెప్పాలి. ముఖ్యంగా అమ్మాయిలను ఏమి మాయ చేసాడేమో గాని ఆయనంటే పడి చచ్చిపోతున్నారు.

తెలుగు హీరోయిన్స్ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ అందరి హీరోయిన్స్ ప్రస్తుతం మీరు ఎవరితో నటించాలని కోరుకుంటున్నారు అంటే ఠ‌క్కుమని విజయ్ దేవరకొండ పేరు చెప్తున్నారు.. ఈ క్రేజ్ ఒకప్పుడు ఏఎన్ఆర్, ఆ తర్వాత నాగార్జున, ప్రస్తుతం మహేష్ బాబులకు ఉంది.

వాస్తవానికి ఇప్పుడు కొత్త తరం మొదలైపోయినట్టే లెక్క. ఆ లిస్టులోకి విజయ్ దేవరకొండ, నాని, సిద్దు జొన్నలగడ్డ‌, విశ్వక్సేన్, నవీన్ పోలిశెట్టి, అడవి శేషు వంటి ఎందరో పోటీ పడుతున్నారు. విజయ్ దేవరకొండ‌కి తొందరగా ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి ఆయనలోని మ్యాన్లినెస్ ఒక కారణం.

ఏ మంత్రం వేసాడో ఏమో తెలియదు కానీ తమన్నా, అనన్య పాండే నుంచి శ్రీదేవి గారాలపట్టి జాన్వి కపూర్ వరకు ఒకరా ఇద్దరా.. అందరూ విజయ్ దేవరకొండ త‌మ‌కు క్ర‌ష్ అని ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి ప్రముఖ స్టార్ హీరోయిన్ రాశి ఖ‌న్నా కూడా చేరిపోయింది.

ఇటీవ‌ల ఆమె ఆహా ఓటీటీ మీడియాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె 2 టాక్ షోలో సీనియర్ హీరోయిన్స్ అయిన‌ జయసుధ, జయప్రద‌తో కలిసి ఒక అతిథిగా హాజరైంది. ఈ టాక్ షోలో బాలయ్య బాబు నీకు టాలీవుడ్ లో ఏ హీరో అంటే క్రష్ ఉంది అని అడుగుతాడు.

అప్పుడు రాశి ఖ‌న్నా సమాధానం చెబుతూ నాకు విజయ్ దేవరకొండ అంటే క్రష్ ఉంది. అతను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను… అని కామెంట్ చేసింది. ఆమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Exit mobile version