- సీఎం హోదాలో కాకపోయినా అభిమానిగానైనా వస్తాడా?
విధాత: రాజకీయాలలో ఉన్న శత్రుత్వం నిజ జీవితంలో కూడా ఉండదు. ఉదాహరణకి చెప్పాలంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చాలా మంచి స్నేహితులు. అలాగే చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డితో పాటు ఎంవి మైసూరా రెడ్డి కూడా మంచి దోస్త్. ఇలా చెప్పుకుంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి.
నెల్లూరు నగర వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పవన్ అంటే పడిచస్తాడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒకానొకసారి తనకు సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ అంటే భలే ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇక ఆయన కుమారుడైన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ తనయుడైన నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని.
ఆయన కడప జిల్లా బాలయ్య బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సమయంలో కూడా ఆయన కడపలో హల్చల్ చేశాడని కొందరు అంటారు. ఇక జగన్ చెప్పడంతోనే బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. బాలయ్య బాబుకి సాయం చేశాడని కూడా అంటారు.
ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. ఆయన సినిమాలైనా, రాజకీయాలైనా, టాక్ షో లైనా మనసుపెట్టి పని చేస్తాడు. తనకు సాధ్యమైనంత మేర వాటి విజయానికి కృషి చేస్తాడు. ఒక్కసారి కమిట్ అయ్యి ఓకే అన్నాడు అంటే సినిమాలలో ఇక దర్శకులు చెప్పినట్టే నటిస్తూ పోతాడు.
మధ్యలో తన ఇంటర్ ఫియరెన్స్ ఉండదు. ఆ విషయాన్ని మరోసారి బాలకృష్ణ ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికెతో ప్రూవ్ చేస్తున్నాడు. మొదటి షోకి కేవలం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు మాత్రమే వచ్చాడు.
కానీ ఆ లోటును తీరుస్తూ ఈసారి ఆయన ఏకంగా తనకున్న పరిచయాలతో, సంబంధాలతో మొదటి ఎపిసోడ్‌కి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ను ఈ షోకి ఆహ్వానించి సందడి చేశాడు.
ఇక ఇటీవల ప్రభాస్, గోపీచంద్‌లతో షో చేసి మెప్పించాడని సమాచారం. ఈనెల 30వ తేదీన ఆహాలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
ప్రోమోలు చూస్తే బాలయ్య బాబు ప్రభాస్ నుంచి గోపీచంద్, రామ్ చరణ్ నుంచి కూడా ఎన్నో విలువైన విషయాలను రాబట్టాడని అర్థమవుతుంది. ఇక తాజాగా ఆయన పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన సన్నిహితులను ఈ షోకి అతిధులుగా రప్పిస్తున్నాడు. ఇదంతా బాలయ్యకు మాత్రమే సాధ్యం.
ఒకవైపు పవన్ కళ్యాణ్ అదే సమయంలో త్రివిక్రమ్‌తో పాటు తనతో గౌతమీపుత్ర శాతకర్ణి తీసిన, ప్రస్తుతం పవన్‌తో హరిహర వీరమల్లు తీస్తోన్న క్రిష్… వీరందరూ గెస్ట్‌లుగా కనిపించనున్నారనే వార్త వైరల్ అవుతున్న సమయంలోనే.. ఇప్పుడు మరో సంచలన వార్త ప్రచారంలోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కూడా తనకున్న పరిచయంతో బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌కి ముఖ్య అతిథిగా పిలుస్తున్నాడని సమాచారం. ఒక ముఖ్యమంత్రి హోదాలో కాకపోయినా బాలయ్యకు ఓ అభిమానిగా, వీరాభిమానిగా జగన్ వస్తే ఇక ఆ షో కి తిరిగే ఉండదు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా బాలయ్యను ఇప్పుటి వరకు నేరుగా విమర్శించలేదు. ఏదో రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని, ఆళ్లనాని, వల్లభనేని వంశీ వంటివారు విమర్శించారు తప్ప.. జగన్ మాత్రం పల్లెత్తు మాట అనలేదు.
ఇటీవల కృష్ణ భౌతిక కాయాన్ని దర్శించుకోవడానికి జగన్ వచ్చినప్పుడు బాలయ్య బాబు అక్కడే ఉన్నాడు. జగన్ కాసేపు ఆయనతో ముచ్చటించాడు కూడా. ఆ చనువుతోనే బాలయ్య బాబు జగన్‌ని పిలిచాడని.. జగన్ కూడా అందుకు ఒప్పుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్, జగన్‌లను ఒకే వేదికపై కూర్చోబెట్టి రాజకీయాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాడని తెలుస్తోంది. అదే నిజమైతే మాత్రం చరిత్రలో ఇది ఎన్నడూ సంభవించని సంచలనాత్మక ఎపిసోడ్ అని చెప్పాలి. డిజిటల్ మీడియాలో ఇది సరికొత్త ప్రభంజనానికి నాంది అవుతుంది..
ఇదే జరిగితే ఇక ఆహాకి కూడా తిరుగు ఉండదు. కాగా ఈ ఎపిసోడ్‌ను ఈనెల 27న షూట్ చేయబోతున్నారు. దీనికోసం కోట్లాది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ కి ఇదే చివరి ఎపిసోడ్ కానుందని అంటున్నారు. అంటే మొదటి ఎపిసోడ్‌కి మాజీ సీఎంను తీసుకుని వచ్చిన బాలయ్య.. చివరి ఎపిసోడ్ కి ప్రస్తుత సీఎంను తీసుకొని వస్తున్నాడు అనే వార్త అన్ని చోట్ల ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి ఇది నిజమవుతుందో కాదో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది!