- సీపీఆర్ చేయడంపై శిక్షణ
- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
CPR Training Drive | విధాత వనపర్తి ప్రతినిధి: గుండెపోటు వచ్చినప్పుడు ప్రాణం రక్షించేందుకు తక్షణం చేయాల్సిన ప్రాథమిక వైద్యం సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ తన ఛాంబర్‌లో వైద్య శాఖ అధికారులతో సీపీఆర్, క్యాన్సర్, క్షయ, సీజనల్ వ్యాధులు, మధుమేహం, ఆర్బీఎస్‌కేపై ప్రోగ్రాం ఆఫీసర్ వారీగా సమీక్ష చేశారు. ఈ మధ్య అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు పోవడం చూస్తున్నామని, దీనిని నివారించేందుకు గుండెపోటు వచ్చిన వారి ప్రాణం రక్షించేందుకు అత్యవసర సమయాల్లో నిర్వహించే సీపీఆర్(CPR) విధానంపై జిల్లాలో సాధ్యమైనంత ఎక్కువమందికి శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. తొలి దశలో అందరు జిల్లా అధికారులు, పోలీసు సిబ్బంది, జిమ్ ట్రైనర్‌లు, విద్యా శాఖలో పీఈటీలు, ఆశ వర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్‌లకు శిక్షణ ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.
జిల్లాలో క్యాన్సర్ వ్యాప్తి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఆగస్టు 15 నుంచి నోటి క్యాన్సర్(Mouth cancer), బ్రెస్ట్ క్యాన్సర్(Breast cancer), గర్భాశయ క్యాన్సర్(Cervical cancer) వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించాలని సూచించారు. వ్యాధి నిర్మూలనపై సమీక్ష నిర్వహిస్తూ ఇప్పటి వరకు నిర్వహించించిన హెచ్.బి.1 సి(HB1C) వైద్య పరీక్షల ద్వారా ఎవరికైతే 8 కన్నా ఎక్కువ రీడింగ్ నమోదు అయ్యిందో వారి వద్దకు మెడికల్ అధికారులు స్వయంగా వెళ్లి షుగర్ లెవెల్ పెరిగిపోవడానికి గల కారణాలను తెలుసుకొని వైద్యం అందించాలని సూచించారు. క్షయ వ్యాధి వల్ల 16 మంది చనిపోవడానికి కారణాలు ఏంటి, వైద్యం అందిస్తున్నప్పటికీ ఎలా చనిపోయారు అనేది కారణాలు తెలుసుకునేందుకు ఆడిట్ నిర్వహించాలని డిప్యూటీ డీఎంఅండ్ హెచ్‌వోను(Deputy DM&HO) ఆదేశించారు.
ఆర్.బి.ఎస్. కె ద్వారా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య ప్రామాణిక కార్డు తయారు చేసి ఆన్ లై న్ లో నమోదు చేయడంతో పాటు విద్యార్థులకు కార్డు ఇవ్వాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి చూపుకు సంబంధించిన క్యాటరాక్ట్ సర్జరీలు చేసేందుకు అవసరమైన వైద్యులు, థియేటర్ అందుబాటులోకి వచ్చినందున సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో డెంగ్యూ(Dengue), మలేరియా(Malaria), చికెన్ గునియా(Chicken Gunia), డయేరియా(Diarrhea) వంటి వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పకడ్బందీగా తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్(Deputy Medical Officer Dr. Srinivas) ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డాక్టర్ పరిమళ, డా. రియాశ్రీ(Program Officer Dr.Sainath Reddy, Dr.Parimila, Dr.Reashri) తదితరులు పాల్గొన్నారు.