Diabetes |
విధాత: మారిన జీవనశైలి వల్ల ఎండలో తిరిగే సమయం తగ్గిపోయిన విషయం తెలిసిందే. కొవిడ్ లాక్‌డౌన్‌లో అందరూ ఇళ్లలో ఉండడం ఆ పరిస్థితిని మరింత బలపరిచింది. ఎండ తగలకపోవడం వల్ల విటమిన్ డి లోపం వస్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విటమిన్ డి లోపం టైప్ 2 డయాబెటిస్‌కి దారి తీయొచ్చని ఒక పరిశోధనలో వెల్లడైంది.
డి విటమిన్ సరిపడా ఉన్న వారి కంటే లేని వారిలో ఇన్సులిన్ ఉత్పత్తి 48 శాతం తగ్గిపోయిందని క్యూరియస్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో ప్రచురితమైన ఒక పరిశోధన పత్రం వెల్లడించింది. అయితే టైప్ 2 డయాబెటిస్ రావడానికి విటమిన్ డి లోపానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు శాస్త్రీయంగా రుజువు కాలేదని ఎండోక్రైనాలజిస్ట్ డా.సోనాలి కాగ్నే వెల్లడించారు.
ఒకవేళ విటమిన్ డి లోపమనేది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచడం ద్వారా డయాబెటిస్ రావడానికి కారణమవుతోందేమో పరిశోధించాలని పేర్కొన్నారు. గ్లూకోజ్‌ను ఉపయోగించుకోవడానికి కణజాలానికి ఎక్కువ ఇన్సులిన్ అవసరం. బీటా కణాలు అధిక మొత్తంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది.
అయితే ఈ ప్రక్రియ వేగంగా జరిగేకొద్దీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి బీటా సెల్స్ మరణిస్తాయి. ఇదే మధుమేహానికి తొలి అడుగు. డి విటమిన్ అనేది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుండొచ్చని తాజా పరిశోధన పేర్కొంది. అలాగే ఆ విటమిన్ లోపం వల్ల కండబలం తక్కువగా ఉండి, నీరసం ఆవహిస్తుంది. ఈ బలంతో డయాబెటిస్‌ను శరీరం ఎదుర్కోలేదు కాబట్టి పరిస్థితి క్రమంగా విషమించే ప్రమాదముంది.
సప్లిమెంట్‌లు తీసుకోచ్చా?
ఏదైనా విటమిన్ లోపం అనగానే మనకు గుర్తొచ్చేది సప్లిమెంట్‌లే… డీ విటమిన్ లోపానికీ ఈ ఉపాయం సరిపోతుందా అంటే లేదనే చెబుతున్నారు వైద్యులు. ఎండలో తిరగడమే డీ విటమిన్ పొందడానికి ఏకైక మార్గమని వారు స్పష్టం చేస్తున్నారు.
సహజంగా ఎలా..
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో ప్రతి మి.లీ.కు 20 నానోగ్రాముల డి విటమిన్ ఉంటుంది. ఇది కనీస స్థాయి. ఇంతకన్నా తక్కువుంటే ఆహారం, ఎండలో తిరగడం ద్వారా మాత్రమే కాకుండా కొద్ది కాలం సప్లిమెంట్లు తీసుకోవచ్చు. చేపలు, సాల్మన్ ఫిష్, ట్రౌట్, ట్యూనా, హాలిబట్, పాలు, యోగర్ట్‌ల వల్ల డి విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. అయితే గదిలో కిటికీ ముందు ఎండలో కూర్చుంటే డి విటమిన్ లభిస్తుందనుకోవడం భ్రమే. సుమారు 20 నిమిషాల పాటు మంచి ఎండ శరీరానికి తగిలితేనే డి విటమిన్ పొందడానికి వీలవుతుంది.