విధాత: సన్ ఫ్లవర్ గింజలు మంచి ఫైబర్ రిసోర్స్. వీటిలో మోనోసాచురేటెడ్ ఫ్యాట్, పాలీ సాచూరేటెడ్ ఫ్యాట్ తోపాటు ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్ల వంటి పోషకాలు పుష్కలం. వీటిని ప్రతి రోజూ తీసుకుంటే రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుముఖం పడతాయి. బీపీని అదుపులో ఉంచవచ్చు. ఇందులో ఉండే ఆరోగ్యవంతమైన కొవ్వులు రక్తనాళాల ఆరోగ్యానికి ఎంతో మంచివి.
హెల్దీ స్నాక్
ప్రోటీన్లు, ఫ్యాట్, ఫైబర్ కలిగిన సన్‌ఫ్లవర్ గింజలను మంచి చిరుతిండిగా చెప్పుకోవచ్చు. కొంచెం తిన్నా సరే కడుపునిండుతుంది. శక్తి సంతరించుకున్న భావన కలుగుతుంది. ఒక ఔన్సు గింజల్లో దాదాపు గా 5.4 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఎన్నో సూక్ష్మ పోషకాలు కలిగిన శాకాహారం ఇవి.
మధుమేహులకు..
డయాబెటిక్స్ బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవడం అవసరం. ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం వంటి పోషకాలు తప్పనిసరిగా అవసరం. సన్ ఫ్లవర్ గింజలలో ఇవి చాలినంత ఉంటాయి. పెద్దగా ప్రాసెస్ లేకుండా సులభంగా వీటిని తినెయ్యొచ్చు. కొన్నిగింజలు గ్రీన్ సలాడ్ తో తినెయ్యొచ్చు. పండ్ల ముక్కలు, వెన్నతో కలిపి తీసుకోవచ్చు.
హార్ట్ ఫ్రెండ్లీ
ఫైబర్, విటమిన్స్, హెల్తీ ఫ్యాట్స్, మినరల్స్ వంటి అన్ని పోషకాలు సన్ ఫ్లవర్ గింజల్లో సమృద్ధిగా ఉంటాయి. అందుకే గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చెయ్యడంలో సన్ ఫ్లవర్ గింజలు బాగా ఉపకరిస్తాయి. 2012లో జరిపిన ఒక అధ్యయనంలో కొంతమంది డయాబెటిక్ మహిళలకు రోజుకు 30 గ్రాముల చొప్పున మూడు వారాల పాటు సన్ ఫ్లవర్ గింజలను ఆహారంలో ఇచ్చారు. వారిలో బీపీ, ఎడీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ లో గణనీయమైన తగ్గుదల కనిపించిందట.
పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్
యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్, విటమిన్ ఈ వంటి యాంటి ఆక్సిడెంట్స్ సెల్ డ్యామేజ్‌ను అడ్డుకుంటాయి. సెల్ డ్యామేజి వల్లే రకరకాల జబ్బులు వస్తాయి. అంతేకాదు యాంటిఆక్సిడెంట్స్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్, పక్షవాతం వంటి ప్రాణాంతక ప్రమాదాలు దరిచేరవు. ఒక్క మాటలో చెప్పాలంటే సన్ ఫ్లవర్ గింజలు అమృతం వంటివి.