Site icon vidhaatha

Watermelon | పుచ్చపండును ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

Watermelon : వేసవి తాపం నుంచి బయటపడానికి చాలామంది ఎండా కాలంలో బటర్‌ మిల్క్‌, నిమ్మరసం, కొబ్బరినీళ్లు లాంటి వాటిని ఆశ్రయిస్తుంటారు. అదేవిధంగా చల్లచల్లటి పండ్ల జ్యూస్‌లను తాగుతుంటారు. ఇలా వేసవి తాపం నుంచి రక్షించే వాటిలో పుచ్చపండు కూడా ఒకటి. పుచ్చపండులో 95 శాతం నీరు ఉంటుంది. కాబట్టి ఎండా కాలంలో తరచూ పుచ్చపండును తింటే శరీరం డీహైడ్రేట్‌ కాకుండా ఉంటుంది. ఎర్రగా, తీయగా, జ్యూసీగా ఉండే పుచ్చపండు తినడాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. వేసవిలో రోడ్లపై విరివిగా ఈ పుచ్చపండ్లు లభిస్తాయి. పుచ్చపండులో పోషక విలువలు కూడా మెండుగా ఉంటాయి. అయితే ఈ పండును రిఫ్రిజిరేటర్‌లో పట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..!



పుచ్చపండులో నీటిశాతంతోపాటు పోషక విలువలు కూడా ఎక్కువ. పొటాషియం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. దీనిలో విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఉంటాయి. ఇది శరీరంలోని వేడిని తొలగిస్తుంది. అయితే ఇన్ని సుగుణాలున్న పుచ్చపండును ఫ్రిజ్‌లో పెట్టకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచితే దానిలో ఉండే పోషక విలువలు నశిస్తాయంటున్నారు. అంతేకాదు.. పుచ్చకాయను కోసి ఫ్రిజ్‌లో పెడితే మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఫుడ్‌ పాయిజన్ అయ్యి ఆస్పత్రిపాలు కావాల్సి వస్తుందంటున్నారు.



సౌత్ సెంట్రల్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ల్యాబోరేటరీలో చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పుచ్చపండును కోసి ఫ్రిజ్‌లో పెడితే ఆ ముక్కలపై బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉందని తేలింది. అది తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది. పరిశోధకులు పుచ్చపండ్లను -44, -55, -70 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద ఫ్రిజ్‌లో భద్రపరిచారు. -70 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద నిల్వ చేసినవి ఎక్కువ పోషకాలు కోల్పోయినట్లు గుర్తించారు. ఈ పండ్లను ఒక వారం ఫ్రిజ్‌లో ఉంచితే కుళ్లిపోయే అవకాశం ఉందంటున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పుచ్చపండు విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Exit mobile version