Chocolate Cravings | విధాత: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చాక్లెట్ ప్రియులున్నారన్న విషయం తెలిసిందే. రకరకాల ఫ్లేవర్స్‌లో వచ్చే వీటిని ఎక్కువ మంది రుచి కోసం తింటూ ఉంటారు. మరి కొంత మంది మందు, సిగరెట్లకు అలవాటు పడినట్లు చాక్లెట్‌కు కూడా అలవాటు (Chocolate Cravings) పడి బాధపడుతుంటారు.
అయితే అలాంటి బలహీనతకు .. శరీరంలోని కొన్ని మూలకాల కొరతకు ఏమైనా సంబంధముందా అని కొన్నేళ్ల నుంచి శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగ్నీషియం కొరత (Magnesium Deficiency) తో బాధపడేవారు చాక్లెట్ల కోసం పరితపిస్తూ ఉంటారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
శరీరం తన విధులను నిర్వర్తించడానికి మెగ్నీషియం అత్యవసరం. నరాల పనితీరు, రక్తంలో చక్కెర నిల్వల సర్దుబాటు, శక్తి ఉత్పత్తి, డీఎన్ఏ, ప్రొటీన్ సింథసిస్ ప్రక్రియల్లో ఈ మూలకం కీలకంగా ఉంటుంది. అయితే చాలా మంది అవగాహన లేక మెగ్నీషియంను రోజూ వారీ ఆహారంలో భాగంగా చేసుకోకపోవడంతో…వారు పలు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి కొంత మంది బాధితుల ఆహారపు అలవాట్లను గమనించగా.. వారందరిలోనూ చాక్లెట్ ఎక్కువగా తినేవాళ్లు అధిక సంఖ్యలో ఉన్నారు.
చాక్లెట్ క్రేవింగ్స్ (బలమైన కోరిక) అనేది మన శరీరంలో ఉన్న విటమిన్స్, మినరల్స్ కొరతను, హార్మోన్‌ల అసమతుల్యతను, మూడ్ స్వింగ్స్‌ను సూచిస్తుంది. ఎముకల దృఢత్వానికి, నరాల సామర్థ్యానికి, 300 ఎంజైమ్‌ల తయారీకి కావాల్సిన మూలకాల్లో మెగ్నీషియం ఒకటి. అయితే దీని కొరత వల్ల షుగర్ ఎక్కువున్న ఆహారం ఎక్కువ తీసుకోవాలని శరీరం బలవంతపెడుతుంది.
అందుకే మనకు అందుబాటులో ఉంటూ షుగర్ శాతం ఎక్కువగా ఉన్న డార్క్ చాక్లెట్‌ను తీసుకోవడానికి మనసు ఉవ్విళ్లూరుతుంది. చాక్లెట్‌ను తినగానే అప్పటి వరకు నీరసంగా ఉన్న వారికి కాసేపు ఉత్సాహంగా ఉంటుంది. తర్వాత తగ్గిపోతుంది. అయితే ఇది బాగా ప్రాసెస్ చేసిన ఆహారం కావడం.. గ్లెసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న కారణంగా.. ఎక్కువగా తింటే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంటుంది.
అయితే మరి మెగ్నీషియం కొరత ఉందని తెలుసుకోవడం ఎలా..? తీవ్రమైన ఒత్తిడి, ఆకలి వేయడం, నీరసం, నిద్రపట్టకపోవడం, తలపోటు, మలబద్దకం వీటిలో ఏ ఒక్క సమస్య తీవ్రంగా వేధిస్తున్న మనలో మెగ్నీషియం కొరత ఉండొచ్చని డా.ఎడ్విన్ రాజ్ (Dr Edwina Raj) సూచించారు. ఒకవేళ మెగ్నీషియం కొరత ఉందని నిర్ధారణ అయితే స్వల్పకాలిక ఓపిక కోసం డార్క్ చాక్లెట్లను ఆశ్రయించొద్దని ఆయన పేర్కొన్నారు.
మెగ్నీషియం కొరత ఉందనుకుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. సప్లిమెంట్లను, షుగర్ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను వినియోగించొద్దు. విత్తనాలు, మొలకెత్తిన గింజలు, గుమ్మడి విత్తనాలు, ఆకుకూరలు, అరటిపళ్లు, అవకాడో మొదలైన వాటిని మీ డైట్‌లో భాగం చేసుకోండి అని రాజ్ పేర్కొన్నారు.