Infertility
విధాత: పెళ్లైన ప్రతి జంట పిల్లలను కనాలకుంటోంది. కానీ కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల్లో ఉండే హార్మోన్ల అసమతుల్యత కారణంగా సంతానం కలగకపోవచ్చు. అయితే సంతానోత్పత్తిలో ఆడవారితో పాటు మగాళ్ల పాత్ర కూడా కీలకమే. ఎందుకంటే మహిళకు అండం విడుదలైనప్పటికీ, పురుషుడి వీర్య కణాలు బలహీనంగా ఉంటే.. గర్భం దాల్చే అవకాశాలు తక్కువ.
వీర్య కణాలు బలహీనంగా ఉండటంతో పురుషుల్లో వంధ్యత్వ సమస్య ఏర్పడుతుంది. తద్వారా వారి సంతాన కలలు కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది. మరి ఈ వంధ్యత్వ సమస్య నుంచి బయటపడాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను పరిశీలిద్దాం.
మద్యం సేవించడం వల్ల శుక్రకణాలపై ప్రభావం..
సంతానోత్పత్తి సవాళ్లను అధిగమించేందుకు పురుషులు తమ జీవనశైలిలో కొన్ని మార్పులు తప్పకుండా చేసుకోవాల్సిందే. పురుషుల్లో వంధ్యత్వానికి ప్రధాన కారణం ఆల్కహాల్.. మద్యం అధికంగా సేవించడం వల్ల శుక్రకణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
దీంతో తన భాగస్వామి అండంతో బలహీనంగా ఉండే వీర్యం ఫలదీకరణం చెందకపోవచ్చు. కాబట్టి భాగస్వామి గర్భం దాల్చడానికి కనీసం మూడు నెలల ముందు మద్యం తీసుకోవడం మానేయాలి. దీని వల్ల వీర్య కణాలు వృద్ధి చెంది, సంతానోత్పత్తికి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.
యోగా, వ్యాయామం, ధ్యానం తప్పనిసరి..
మానసిక ఒత్తిడి కూడా వంధ్యత్వానికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఒత్తిడి కారణంగా హార్మోన్ల విడుదలలో సమతుల్యత ఉండదు. అంతేకాకుండా వీర్య కణాల నాణ్యతపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. హార్మోన్ల అసమతుల్యత, వీర్యకణాల నాణ్యతను పెంచుకోవడానికి యోగా, వ్యాయామం, ధ్యానం వంటి కార్యక్రమాలను జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి.
వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా, టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయిలను పెంచుకోవచ్చు. రోజుకు కనీసం 7 గంటల పాటు హాయిగా నిద్రించాలి. దీంతో ఒత్తిడికి దూరమై, సంతానోత్పత్తికి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు.
వీటితో వీర్య కణాలను వృద్ధి చేసుకోవచ్చు..
వంధ్యత్వంతో బాధపడేవారు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. జింక్, ఫోలేట్‌తో పాటు యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇక మద్యానికి, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. డ్రగ్స్ తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.
ఇక గోరు వెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి. వృషణాలకు ఇబ్బంది కలగకుండా, బిగుతైన దుస్తులు ధరించకపోవడం మంచిది. రసాయనాలు, విషపూరిత వాయువులను పీల్చకూడదు. దీని వల్ల వీర్య కణాలపై ప్రభావం పడుతుంది.
సరైన జీవనశైలిని పాటించడం ద్వారా.. పురుషుల్లో వంధ్యత్వాన్ని అధిగమించొచ్చు. విజయవంతంగా గర్భధారణ అవకాశాలను పెంచుకోవచ్చు. పై సూచనలు పాటించినప్పటికీ కూడా సంతానం కలగపోతే సంబంధిత వైద్యులను సంప్రదించి మెడికేషన్ తీసుకోవడం మంచిది.