Pumpkin Juice | గుమ్మడికాయతో అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. అయితే, దాని రుచి కొందరికి నచ్చదు. కానీ, గుమ్మడికాయ శరీరంలోని అనేక వ్యాధులపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. విటమిన్లు, ఫైబర్, పొటాషియం, కాల్షియంతో సహా అనేక పోషకాలు గుమ్మడికాయలో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాలానుగుణ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుమ్మడికాయ రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీర బరువు వేగంగా తగ్గుతూ రావడంతో పాటు పొట్టకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. చాలా మంది గుమ్మడికాయను హల్వా, సూప్ రూపంలో తీసుకునేందుకు ఇష్టపడుతారు. కానీ, ఎక్కువగా వేడి చేయడంతో అందులోని పోషకాలు నాశనం అవుతాయని, అందుకే రసం తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గుమ్మడికాయ రసంతో ఆరోగ్య ప్రయోజనాలు
- శీతాకాలంలో చాలామంది జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ప్రతిరోజూ ఒక కప్పు గుమ్మడికాయ రసం తాగడం వల్ల అజీర్ణం సమస్య నుంచి బయటపడొచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని జీర్ణవ్యవస్థను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.
- స్థూలకాయం ముఖ్యంగా అజీర్ణం సమస్య ఉన్నవారిలో, ఆరోగ్యకరమైన ఆహారం నియమాలు పాటించని వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. గుమ్మడికాయ రసంలో కాల్షియం, పొటాషియం, విటమిన్ ఏ, ఈ, సీ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జ్యూస్ తాగడం వల్ల పెరుగుతూ వస్తున్న స్థూలకాయాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
- గుమ్మడికాయ రసంలో ఉండే విటమిన్ ఏ, ఈ.. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీనితో పాటు, గుమ్మడికాయ రసం మధుమేహం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ రసం శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్పై కూడా ప్రభావాన్ని చూపుతుంది.