Vidhaatha.com | హైదరాబాద్, అక్టోబర్ 9, 2025
ఆర్టీసీ బస్ టికెట్ ధరలను పెంచడంపై బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిరసన తెలిపింది. ఈ నిరసనలో భాగంగా ‘చలో బస్ భవన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌తో పాటు ఇతర నాయకులు, ఎమ్మెల్యేలు బస్ భవన్‌కు చేరుకున్నారు. వారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి, పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ లేఖ ఇచ్చారు.
పోలీసుల అడ్డంకులు.. అయినా నిరసన
ఉదయం నుంచే కేటీఆర్‌ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. హరీశ్ రావు, సబితా, పద్మారావు గౌడ్ ఇళ్ల వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. “బస్ ఎక్కి బస్ భవన్‌కు వెళ్లి లేఖ ఇవ్వాలనే మా ఉద్దేశం. దానికే ఇంత భద్రతా?” అని కేటీఆర్ ఎక్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, పోలీసు అడ్డంకులను దాటి కేటీఆర్ సికింద్రాబాద్‌లోని రేతిఫైల్ బస్ స్టాండ్‌కు చేరుకుని, అక్కడి నుంచి సీనియర్ నాయకులతో కలిసి ఆర్టీసీ బస్సులో బస్ భవన్‌కు వెళ్లారు. హరీశ్ రావు మెహదీపట్నం నుంచి, సబితా మహేశ్వరం నుంచి, ఇతర నాయకులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చారు. బస్ భవన్ వద్ద పోలీసులు బారికేడ్లు, మూడు అంచెల భద్రత ఏర్పాటు చేసారు. అక్కడ బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులను దాటుకుని బస్సు భవన్ లోపలికి చేరుకున్న బీఆర్ఎస్ బృందం
పెంచిన టికెట్ ధరలను తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి ప్రతిపాదన అందజేయనున్న బీఆర్ఎస్ నాయకులు pic.twitter.com/NKmCTC1SjT
— Telugu Scribe (@TeluguScribe) October 9, 2025
కేటీఆర్ ఆరోపణలు.. ఆర్టీసీ ఎండీతో భేటీ
కేటీఆర్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం బస్ ధరలను అడ్డగోలుగా పెంచింది. మహిళలకు ఉచిత బస్సు అంటూ, పురుషులకు టికెట్ ధరలు రెట్టింపు చేస్తే కుటుంబాలపై భారం పడదా? దీన్ని మహిళలు మాత్రం ఆదరిస్తారా? బస్ పాస్ ధరలు కూడా పెంచారు. సీట్లు కూడా దొరకని పరిస్థితి. బస్సుల సంఖ్య కూడా తక్కువగా ఉంది. ” అని రేవంత్ రెడ్డి సర్కార్‌ను నిలదీశారు.
బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసిన కేటీఆర్, హరీశ్ రావు, సబితా, తలసాని, పద్మారావు గౌడ్‌లు పెంచిన ధరలను తగ్గించాలని కోరారు. ఎండీ సమాధానంగా, మహాలక్ష్మి పథకం కింద ₹1,353 కోట్లు బకాయిలు ఉన్నాయని వివరించారు. కేటీఆర్ స్పందిస్తూ, “కేసీఆర్ హయాంలో ఆర్టీసీకి రూ.9,246 కోట్లు ఇచ్చాం. ఈ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని చూస్తోంది. టికెట్ ధరలు తగ్గించి, ఆర్టీసీని బలోపేతం చేయాలి” అని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందన.. విపక్షాల ఆందోళన
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరసనలపై ఆగ్రహం వెలిబుచ్చింది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, గతంలో బీఆర్ఎస్ నిరసనలను అణచివేసి, ఇప్పుడు వారే చలో బస్ భవన్ అనడం విడ్డూరంగా ఉందంటూ విమర్శించారు. అయితే, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను గృహ నిర్బంధంలో ఉంచడం తప్పు అని హరీశ్‌రావు అన్నారు.
ఈ ‘చలో బస్ భవన్’ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. పెంచిన బస్ ధరలు పేదలకు, కుటుంబాలకు భారం అని నాయకులు చెప్పారు. ఆర్టీసీని బలోపేతం చేసి, బకాయిలు చెల్లించి, ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తల కోసం vidhaatha.comను సందర్శించండి.