విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ చాదర్ ఘాట్ లో పోలీసు కాల్పులు(Chaderghat police Firing) కలకలం రేపాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ గ్రౌండ్‌లో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య(DCP Chaithanya)పైన దొంగ దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో డీసీసీ చైతన్య దొంగపై కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా సమాచారం. ఈ కాల్పులలో దొంగకు మూడు చోట్ల గాయాలవ్వగా..అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఓ దొంగ సెల్‌ఫోన్ చోరీకి పాల్పడగా.. అతడ్ని పట్టుకునేందుకు డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో డీసీపీపై కత్తితో దాడి చేసేందుకు దొంగ ప్రయత్నించగా.. తోపులాటలో గన్ మెన్ కిందపడిపోయాడు. గన్‌మన్ వద్ద ఉన్న తుపాకీ తీసుకొని సెల్‌ఫోన్ స్నాచర్‌పై డీసీపీ చైతన్య కాల్పులు జరిపాడు. డీసీపీ మూడు రౌండ్లు కాల్పులు జరుపడంతో దొంగకు గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించారు.
ఇటీవల నిజమాబాద్ లో ప్రమోద్ అనే కానిస్టేబుల్ పై రౌడీషీటర్ రియాజ్ కత్తితో దాడి చేసిన ఘటనలో కానిస్టేబుల్ చనిపోగా, మరో ఏఎస్ఐకి గాయాలయ్యాయి. అనంతరం రియాజ్ ను పోలీసులు అరెస్టు చేయడం..అతను ఆసుపత్రి నుంచి తప్పించుకునే క్రమంలో పోలీసుల గన్ లాక్కుని దాడికి ప్రయత్నించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు జరిపి కాల్పుల్లో రియాజ్ హతమవ్వడం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరోసారి పోలీసులపై దాడి ఘటన పునరావృతం కావడం గమనార్హం.
