Local Body Elections | ప్రజా పాలన వారోత్సవాల తర్వాతే స్థానిక పోరు.. క్యాబినెట్ కీలక నిర్ణయం

ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సోమవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

విధాత, హైదరాబాద్ :
ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సోమవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే ఈ ఎన్నికలు నిర్వహించడానికి మంత్రివర్గం చర్చించింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.

ఈ నెల 24వ తేదీన రాష్ట్ర హై కోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉన్న పిటిషన్ విచారణ జరగనున్నది. దీనికి అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం త్వరితగతిన ఎన్నికల ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాలు పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని క్యాబినెట్ స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అవసరమైన ఏర్పాట్లు, అధికారుల నియామకాలు, భద్రత, ఓటర్‌ జాబితాల తదితర అంశాలపై సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశాలు జారీ చేసినట్టు సమాచారం.