విధాత : వరుస ప్రమాదాలతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రయాణికుల పాలిట మృత్యు శకటాలుగా మారుతున్నాయి. కర్నూల్ లో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్థమైన ప్రమాదంలో 19మంది ప్రయాణికులు సజీవ దహనమైన ఘటన తర్వాత వరుసగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం హైదరాబాద్ – విజయవాడ హైవే పై చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ‘విహారి’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Vihari travels bus fire accident)లో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు దగ్ధమైన ఘటన కలకలం రేపింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి సకాలంలో మంటలను గుర్తించి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వారంతా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.
ప్రయాణికులలో కొందరు అద్దాలు పగులగొట్టుకుని, మరికొందరు ఎగ్జిట్ డోర్ గుండా కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వెలుతుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిప్రమాద సిబ్బంది వచ్చి మంటలను అర్పేశారు. అప్పటికే మంటల్లో బస్సు పూర్తిగా దగ్దమైంది.
