లోన్ రికవరీ వేధింపులకు చెక్..ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవే

లోన్ రికవరీ వేధింపులకు చెక్ పెడుతూ ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. రికవరీ ఏజెంట్ల ప్రవర్తన, కాల్స్, డేటా వినియోగంపై కఠిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

లోన్ రికవరీ పేరుతో వేధింపులకు అడ్డుకట్ట వేస్తూ ఆర్బీఐ(RBI) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత అక్టోబర్ 1, 2026 నుంచి కొత్త రూల్స్ అమలులో తీసుకొస్తామని తెలిపింది.కొత్త రూల్స్‌తో రుణగ్రహీతల గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తి రక్షణ కల్పిస్తున్నామని ఆర్బీఐ వెల్లడించించి.

ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు…ఇకపై ఎవరినైనా రికవరీ ఏజెంట్లుగా నియమించడానికి వీల్లేదు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లేదా గుర్తింపు పొందిన సంస్థల సర్టిఫికేట్ ఉన్న వారినే లోన్ రికవరీకి నియమించాలి. రికవరీ ఏజెంట్ల పూర్తి వివరాలు బ్యాంకుల వెబ్‌సైట్, యాప్స్‌లో ముందుగానే ఉంచాలి. కస్టమర్ ఇంటికి మొదటిసారి వెళ్లే ముందు కనీసం ఒక రోజు ముందే సమాచారం ఇవ్వాలి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్లను సంప్రదించాలి.

రికవరీ ఏజెంట్లు సభ్యతగా, మర్యాదగా మాట్లాడాలి. అసభ్య పదజాలం,బెదిరింపులు, పదే పదే కాల్స్ చేసి వేధించడం పూర్తిగా నిషేధం. కస్టమర్ల బంధువులు,సహోద్యోగులను ఇబ్బంది పెట్టకూడదు. వ్యక్తిగత వివరాలు,ఆడియో/వీడియో రికార్డింగులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నిషేధం. కస్టమర్ మొబైల్‌లోని కాంటాక్ట్స్, ఫోటోలు వంటి డేటాను యాక్సెస్ చేయడం లేదా స్టోర్ చేయడం నిషేధం. లోన్ రికవరీ కోసం మొబైల్ ఫోన్ ఫీచర్లను బ్లాక్ చేసే టెక్నాలజీ వినియోగించకూడదు. మొబైల్ కొనుగోలు లోన్ అయితే గడువు ముగిసి 90 రోజులు దాటిన తర్వాత మాత్రమే ముందస్తు నోటీసుతో ఫోన్ లాక్ చేయాలి. ఫోన్ లాక్ చేసినా ఇంటర్నెట్, ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్వోఎస్, ప్రభుత్వ భద్రతా అలర్ట్స్ నిలిపివేయకూడదు. నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ సర్వీసులు నిలిపితే ప్రతి గంటకు రూ.250 చొప్పున కస్టమర్‌కు పరిహారం చెల్లించాలి.

లోన్ రికవరీ కోసం చేసే ప్రతి కాల్ సమయం, నంబర్, సంభాషణను బ్యాంకులు రికార్డ్ చేయాలి. కాల్ రికార్డులను కనీసం 6 నెలలు భద్రపరచాలి. కోర్టు కేసులు ఉంటే కేసు పూర్తయ్యే వరకు డేటా స్టోర్ చేయాలి. రికవరీ ఏజెంట్ల తప్పిదాల వల్ల కస్టమర్ నష్టపోతే బ్యాంకే పరిహారం చెల్లించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి :

పెద్దపులి దాడిలో..నలుగురు మహిళల మృతి
రాజ్యసభలో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్?

Latest News