విధాత, హైదరాబాద్ : తెలంగాణ కేబినెబ్ సమావేశం(Telangana Cabinet Meeting) రేపు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరుగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే నేపథ్యంలో..పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించి..పాత రిజర్వేషన్ల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణ విషయమై కేబినెట్ నిర్ణయం తీసుకోవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపులో ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. తెలంగాణ హైకోర్టు కూడా నవంబర్ 24 లోపు స్థానిక ఎన్నికల తేదీలపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికలపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశముంది.
కేబినెట్ లో గిగ్ వర్కర్ల నూతన విధానంపైనా చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. అలాగే ఇటీవల మరణించిన కవి, రచయిత అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, స్మృతి వనం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్–2025, డిసెంబర్ 8న ప్రజాప్రభుత్వం రెండో వార్షికోత్సవం, డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్–2047 పాలసీ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో వాటి నిర్వహణ తీరుతెన్నులపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణ, ఎస్ ఎల్బీసీ, ప్రాణహిత చేవేళ్ల(తుమ్మిడి హట్టి) ప్రాజెక్టులపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉందని సమాచారం.
