హెచ్ 1 బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచడం వల్ల భారతీయ ఐటీ సంస్థలపై ఆ ప్రభావం స్వల్పంగానే ఉంటుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) తెలిపింది. ఈ మేరకు నాస్కామ్ సోమవారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. పెంచిన వీసా ఫీజును 2026లో చెల్లించాల్సి ఉందని.. ఈ లోపే కంపెనీలు తమకు అవసరమైన శిక్షణను స్థానికులకు ఇచ్చేందుకు అవకాశం ఏర్పడిందని నాస్కామ్ అభిప్రాయపడింది. శిక్షణ కోసం బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్న విషయాన్ని నాస్కామ్ గుర్తు చేసింది. మరో వైపు అమెరికాలో పనిచేస్తున్న భారతీయ కంపెనీలు హెచ్ 1 బీ వీసాలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించాయని నాస్కామ్ వివరించింది. భారతదేశానికి చెందిన కంపెనీలు 2015లో 14,792 హెచ్ 1 బీ వీసాలకు ధరఖాస్తు చేసుకున్నాయి. 2024 నాటికి అవి 10,162కు తగ్గాయని నాస్కామ్ ప్రస్తావించింది. టాప్ 10 భారతీయ కంపెనీల్లో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో హెచ్ 1 బీ వీసా కలిగిన వారు 1 వాతం మాత్రమేనని నాస్కామ్ వివరించింది.
హెచ్ 1 బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఈ ఆర్డర్ పై సంతకం చేశారు. సెప్టెంబర్ 21 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. అయితే కొత్తగా హెచ్ 1 బీ వీసా కోసం ధరఖాస్తు చేసుకున్నవారు మాత్రమే ఈ ఫీజు చెల్లించాలి. రెన్యూవల్ కు అవసరం లేదు. ప్రస్తుతం హెచ్ 1 బీ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్న వారికి కూడా ఈ ఫీజు చెల్లింపు అవసరం లేదని కూడా వైట్ హౌస్ స్పష్టత ఇచ్చింది.