Congress CPI Rift | తెలంగాణలో రాజకీయ ‘పునరేకీకరణ’.. కాంగ్రెస్, సీపీఐ పక్షాల మధ్య మిత్రభేదం

నిన్నమొన్నటి వరకూ మిత్రులుగా ఉన్న సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య సఖ్యత కొరవడిందా? అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్న సీపీఐ, కాంగ్రెస్‌.. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో ఎందుకు కత్తులు దూసుకుంటున్నారు?

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Congress CPI Rift | తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు కొత్త రాజకీయ పునరేకీకరణకు నాందిగా మారాయా? అంటే ఔననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కొత్త దోస్తీలు మున్సిపల్ ఎన్నికల మేరకే ఉంటాయా? ఆ తర్వాత కూడా కొనసాగుతాయా? అనేది రానున్న రోజుల్లో తేలనున్నప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న పార్టీల మధ్య విభేదాలు పెరిగి.. కొత్త కూటమిల వైపు మొగ్గుచూపడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తోంది. ఈ పరిణామాన్ని పరిశీలిస్తే కొత్త రాజకీయ పునరేకీకరణ దిశగా రాష్ట్ర రాజకీయాలు పయనిస్తున్నాయా? అనే అనుమానం వస్తోంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఉన్న రాజకీయాల్లో తాజా మున్సిపాలిటీ ఎన్నికలు కొత్త మార్పులకు మలుపుగా మారాయా? అనే చర్చ సాగుతోంది.

అసెంబ్లీలో దోస్తీ … మున్సిపోల్స్‌లో కుస్తీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ మధ్య దోస్తీ కుదిరింది. ఈ ఎన్నికల్లో రెండు పక్షాలు కలిసిపోటీచేశాయి. కాంగ్రెస్, టీజేఎస్ మధ్య కూడా స్నేహం కుదిరింది. అయితే.. ఎమ్మెల్సీ హామీతో టీజేఎస్‌ ఒక్క సీటులో కూడా పోటీ చేయలేదు. సీపీఐకి కొత్తగూడెం అసెంబ్లీ స్థానం కేటాయించారు. ఈ పొత్తులో భాగంగా పోటీచేసి కొత్తగూడెం స్థానాన్ని సీపీఐ కైవసం చేసుకున్నది. ఇక్కడి నుంచి సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. అప్పటి నుంచి సీపీఐ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వివిధ సందర్భాల్లో రాజకీయంగా కూడా మద్దతుగా నిలుస్తోంది.

పొత్తులో భాగంగా సీపీఐ నాయకుడు సత్యం, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌లను ఎమ్మెల్సీలను చేసి, మిత్రధర్మం పాటించారు. నిన్నమొన్నటి వరకు ఈ మిత్రుత్వం సాఫీగానే సాగుతూ వచ్చింది. మొన్నటికి మొన్న ఖమ్మంలో జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు, నిన్నటికి నిన్న రావినారాయణరెడ్డి పురస్కార ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు పక్షాల మధ్య పొత్తు తప్పకుండా ఉంటుందని అంతా భావించారు. ముఖ్యంగా సీపీఐ ఈ మేరకు ‘పొత్తు’ పై ఆశలు కూడా పెట్టుకున్నది. ఇప్పుడు ఇదంతా గతంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు తారుమారయ్యాయి

కాంగ్రెస్, సీపీఐ మధ్య వైరం

స్థానిక ఎన్నికలుగా భావించినప్పటికీ పార్టీ గుర్తులపై పోటీ చేస్తున్నందున మున్సిపల్ ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యం చేకూరింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు చిత్తయ్యింది. పైగా కాంగ్రెస్ వైరి పక్షమైన బీఆర్ఎస్‌తో సీపీఐ దోస్తీకి దిగింది. ఎన్నికల బరిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సీపీఐ అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ముందుగా సీపీఐ తమకు బలమున్న చోట్ల కాంగ్రెస్‌తో పొత్తుకు తొలి ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఖాతరు చేయకుండా ఒంటరి పోటీకి సిద్ధమయ్యారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ ప్రధానంగా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం కార్పొరేషన్,ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, మహబూబాబాద్, మంచిర్యాల, జనగామ, ఇతరత్రా కొన్ని మున్సిపాలిటీల్లో తమకు పట్టున్నచోట్ల కొన్ని స్థానాలు కోరారు. నామినేషన్ల దాఖలకు చివరి ఘడియ వరకూ పొత్తుపై సీపీఐ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, అనూహ్యంగా సీపీఐని పట్టించుకోకుండా కాంగ్రెస్ ఒంటరి పోరాటానికి దిగింది. దీనికి రెండు కారణాలున్నాయని భావిస్తున్నారు. ఒకటి కాంగ్రెస్ లో పోటీ ఎక్కువగా ఉండడం ఒకటైతే, సీపీఐ వల్ల తమకు పెద్దగా లాభం లేదని స్థానిక నాయకత్వం భావించారనేది మరొకటి. ఏది ఏమైనా పొత్తు మాత్రం చెడింది. దీంతో సీపీఐ స్థానిక పరిస్థితుల ప్రకారం పొత్తులకు సిద్ధమైంది. కొత్తగూడెంలో టీడీపీతో, ఎదులాపురంలో, మహబూబాబాద్, మంచిర్యాలలో బీఆర్ఎస్ తో పొత్తకు సిద్ధమైంది. ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ నాయకులు అందిపుచ్చుకుని చకచకా పావులు కదిపారు.

కాంగ్రెస్ నాయకులపై సీపీఐ ఫైర్

కాంగ్రెస్ నాయకుల తీరుపై సీపీఐ నాయకులు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొత్తును కాంగ్రెస్ నాయకులు కాలదన్నడం పై ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు కూనంనేని, నారాయణ, తక్కెళ్ళపెల్లి మండిపడుతున్నారు. మంచిర్యాలలో సింగరేణి కార్మిక నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయా జిల్లాల్లోని కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నప్పటికీ సీఎం రేవంత్ ను, కాంగ్రెస్ ను టార్గెట్ చేయకపోవడం గమనార్హం. ఖమ్మంలో మంత్రి పొంగులేటిని, మానుకోటలో ఎమ్మెల్యే మురళీనాయక్ ను, మంచిర్యాలలో మంత్రి వివేక్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ఓడించాలని పిలుపునివ్వడమే కాకుండా బీఆర్ఎస్ తో కొత్త దోస్తీ కుదర్చుకుని కలిసి సాగుతున్నారు. ఈ పరిణామాలు సీపీఐకి కొంత బలమున్న సింగరేణి ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయం పై ప్రభావం చూపుతోందంటున్నారు. ఈ రాజకీయ పొత్తులు, పరిణామాలు మున్సిపల్ ఎన్నికల మేరకే ఉంటాయా? ఆ తర్వాత కూడా కొనసాగుతాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారగా, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తో దోస్తీ సాగుతుందా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

Read Also |

Cancer Treatment | క్యాన్స‌ర్ చికిత్స‌లో విప్ల‌వం.. లుకేమియాకు చికిత్స సాధ్య‌మే!
Lagnesh Kumar | చూపులేక‌పోయినా.. లా చ‌దివి ప్రాక్టీస్ చేస్తున్నాడు.. దృష్టిలోపం ఉన్న తొలి న్యాయవాదిగా..

Latest News