Cancer Treatment | క్యాన్స‌ర్ చికిత్స‌లో విప్ల‌వం.. లుకేమియాకు చికిత్స సాధ్య‌మే!

ఇటీవలి కాలంలో వైద్య రంగంలో వెల్లువలా వస్తున్న పరిశోధన ఫలితాలు.. క్యాన్సర్‌కు చికిత్స సాధ్యమేనన్న ఆశలను రేకెత్తిస్తున్నాయి. లుకేమియా, ప్యాంక్రియాటిక్‌ వంటి క్యాన్సర్‌లపైనా విజయం సాధించవచ్చని తేల్చి చెబుతున్నాయి. మిరాకిల్‌ క్యూయర్స్‌ పేరుతో ఈ పరిశోధనల ఫలితాలతో పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. వీటిలో అన్నీ సత్యాలే కాకపోయినా.. చాలా వరకూ పురోగతి ఉందని వైద్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. అయితే.. పూర్తిస్థాయిలో క్యూర్‌ అని చెప్పడం తొందరపాటే అవుతుందని అంటున్నారు.

cancer treatment image created by AI

Cancer Treatment | మానవాళికి పెను సవాలు విసురుతున్న రోగాల్లో క్యాన్సర్‌ ఒకటి. శరీరంలో నిలువెల్లా అవయవాలను పీల్చి పిప్పి చేసే ఈ వ్యాధి సోకిందంటే ప్రాణాలతో బయటపడటం చాలా అరుదనే చెప్పాలి. ప్రత్యేకించి క్యాన్సర్‌ను గుర్తించగలిగే సమయం అత్యంత కీలకం. కానీ.. చాలా కేసులలో అడ్వాన్స్డ్‌ స్టేజ్‌లోనే గుర్తించగలుగుతున్నారు. ప్రత్యేకించి భారతదేశం లాంటి వర్ధమాన దేశాల్లో అవగాహన లోపమైతేనేమి.. తగినంత వైద్య చైతన్యం లేకపోవడం అయితేనేమి.. ఇటువంటి కేసులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే.. ఇటీవలి కాలంలో వైద్య రంగంలో వెల్లువలా వస్తున్న పరిశోధన ఫలితాలు.. క్యాన్సర్‌కు చికిత్స సాధ్యమేనన్న ఆశలను రేకెత్తిస్తున్నాయి. లుకేమియా, ప్యాంక్రియాటిక్‌ వంటి క్యాన్సర్‌లపైనా విజయం సాధించవచ్చని తేల్చి చెబుతున్నాయి. మిరాకిల్‌ క్యూయర్స్‌ పేరుతో ఈ పరిశోధనల ఫలితాలతో పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. వీటిలో అన్నీ సత్యాలే కాకపోయినా.. చాలా వరకూ పురోగతి ఉందని వైద్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. అయితే.. పూర్తిస్థాయిలో క్యూర్‌ అని చెప్పడం తొందరపాటే అవుతుందని అంటున్నారు.

వివిధ రకాల క్యాన్సర్‌లకు పురోగతిలో ఉన్న పరిశోధనలు వివరాలు గమనిస్తే.. రష్యా అభివృద్ధి చేసిన ‘Enteromix’ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇమ్యూనోథెరపీ వ్యాక్సిన్. ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఇప్పటికే చిన్న స్థాయిలో ఫేజ్‌ వన్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. కొన్ని కేసులలో ట్యూమర్‌ సైజ్‌ తగ్గడాన్ని పరిశోధకులు గుర్తించారు. అయితే.. ఇది వంద శాతం క్యూర్‌ చేస్తుందని చెప్పేందుకు తగిన పీర్‌ రివ్యూడ్‌ పరిశోధనలు లేవు. ఫేజ్‌ 1 ట్రయల్స్‌ అంటే.. భద్రత పరీక్ష మాత్రమేనని, అది పూర్తిస్థాయి మందుకాదని నిపుణులు చెబుతున్నారు.

వియత్నాం.. బ్లడ్‌ క్యాన్సర్‌కు చేస్తున్న సెల్‌ థెరపీ కూడా ఆశాజనక ఫలితాలనిస్తున్నదని అంటున్నారు. CAR-T సెల్ థెరపీతో ఒక లుకేమియా రోగికి చికిత్స అందించారు. నిజానికి CAR-T సెల్‌ థెరపీ అనేది ప్రపంచంలో ఇప్పటికే వాడుతున్న ఇమ్యూనోథెరపీ అని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. ఇది కొన్ని రకాల ప్రత్యేక బ్లడ్‌ క్యాన్సర్‌లకు మాత్రమే పనిచేస్తుందనే వాదన ఉంది. అందరికీ ఉపయోగపడే స్థాయిలో దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉన్నది.

ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ విషయంలో స్పెయిన్‌లో క్యాన్సర్‌ ట్రపుల్‌ డ్రగ్‌థెరపీపై పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. అయితే మానవులపై క్లినికల్‌ ట్రయల్స్‌ ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది. కొరియా, చైనా, మెక్సికో బ్రేక్‌ త్రూస్‌ పేరిట కొన్ని పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నా.. వాటికి తగిన క్లినికల్‌ ట్రయల్‌ ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు. పశువులకు ఇచ్చే Fenbendazole వాడితే స్టేజ్-IV క్యాన్సర్ కూడా పోతుందంటూ వచ్చే వదంతులే కాకుండా.. ఆరోగ్యానికి ప్రమాకర సలహాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఇమ్యూనోథెరపీ, మోనోక్లోనల్‌ యాంటిబాడీల విషయంలో నిజమైన పురోగతి ఉందని వైద్యులు చెబుతున్నారు. Dostarlimab వంటి మందులతో కొంతమంది రోగుల్లో ట్యూమర్లు పూర్తిగా మాయమయ్యాయని, CAR-T, checkpoint inhibitors మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెబుతున్నారు. అయితే.. ఇవి ప్రత్యేక రకాల క్యాన్సర్‌లకే కానీ.. యూనివర్సల్‌ క్యూర్‌ అని చెప్పలేమని అంటున్నారు. క్యాన్సర్‌కు ఒక్కరోజులో మందు దొరకదని, ఇది సంవత్సరాల పరిశోధన, వేలాది రోగుల పరీక్షల తర్వాతే సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. మొత్తంగా క్యాన్సర్‌ పరిశోధనలో నిజమైన పురోగతి ఉందని, ఇమ్యూనోథెరపీ భవిష్యత్తుకు ఆశ చూపిస్తున్నదని అంటున్నారు.

Read Also |

OTT Movies | ఈ వారం ఓటీటీలో వినోదాల విందు.. స్ట్రీమింగ్‌కు రెడీ అయిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Telangana CS K Ramakrishna Rao Retirement : మార్చి 31న రిటైర్ కానున్న సీఎస్…14సార్లు తెలంగాణ బడ్జెట్ రూపకల్పన
Mumbai Local Train | బుర‌ఖా ధ‌రించి లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కిన యువ‌కుడు.. త‌ర్వాత ఏమైందంటే..?

Latest News