ఇస్లామాబాద్: పాక్ వైమానిక దళం తన స్వంత ప్రజలపై దాడులు జరిపిన దారుణం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని తీరా లోయలో సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిపిన వైమానిక దాడిలో 30 మంది పౌరులు, అందులోనూ మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
చైనా తయారీ JF-17 యుద్ధ విమానాలు, ఎనిమిది LS-6 లేజర్ గైడెడ్ బాంబులు వదిలి, మత్రే దారా గ్రామాన్ని తుత్తునియలుగా మార్చేశాయి. ఈ దాడిలో మృతులంతా నిరపరాధులైన పౌరులని స్థానిక అధికారులు ధృవీకరించారు. తమ ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలే బలయ్యారని, తీవ్రవాదులెవరూ లేరని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు.
దాడి అనంతరం బయటకు వచ్చిన దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. మంచాలపై పడి ఉన్న చిన్నారుల శవాలు, దుప్పట్లు కప్పిన మృతదేహాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన పరిశీలకులు, గాజాలో ఇజ్రాయెల్ దాడుల తర్వాత కనిపించే దృశ్యాలకు మరోరూపమని వ్యాఖ్యానించారు.
ఉగ్రవాద వ్యతిరేక చర్యల పేరిట పాక్ తన పౌరులపైనే బాంబులు వేస్తోందని అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. గత ఆరు నెలల్లో ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో 605 ఉగ్రదాడులు జరిగినప్పటికీ, వాటిని అరికట్టడంలో విఫలమైన పాక్ ప్రభుత్వం, దానికి బదులుగా తీవ్రవాదుల పేరిట పౌరులనే బలి చేస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి. జూన్ 20న దక్షిణ వజిరిస్తాన్‌లో డ్రోన్ దాడిలో ఒక చిన్నారి మృతి చెందింది. మార్చి 29న మరొక దాడిలో 11 మంది చనిపోగా, మే 19న నలుగురు చిన్నారులు బలయ్యారు. మే 28న వానాలోని వాలీబాల్ మైదానంలో జరిగిన డ్రోన్ దాడిలో 22 మంది గాయపడ్డారు. ఈ దారుణాలన్నీ పాకిస్తాన్ ప్రభుత్వ పాలనావైఫల్యానికి నిదర్శనాలుగా నిలిచాయి.
Amnesty International పాక్ చర్యలను తీవ్రంగా ఖండించింది. పౌరుల ప్రాణాలను రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని పేర్కొంది. “పూర్తి స్థాయి, స్వతంత్ర, పారదర్శక విచారణ జరిపి బాధితులకు న్యాయం, పరిహారం అందించాలి” అని ఆ సంస్థ దక్షిణాసియా డెప్యూటీ రీజినల్ డైరెక్టర్ ఇసబెల్ లాసీ అన్నారు.
https://x.com/mayankcdp/status/1970009712122048649
పాక్ సైన్యం మాత్రం ఈ దాడులు టిటిపి (తహ్రీక్-ఎ-తాలిబాన్ పాక్) స్థావరాలపై జరిగాయని చెబుతోంది. కానీ వాస్తవానికి ఉగ్రవాదులు పౌరులను మానవ కవచాలుగా వాడుతున్నారన్న పేరుతో సాధారణ గ్రామాలపైనే బాంబులు వేస్తోంది. గతంలో జైష్-ఎ-మహమ్మద్, హిజ్‌బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలు భారత ఆపరేషన్ సిందూర్ తర్వాత ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలోకి తరలిపోతున్నాయని నివేదికలు వెల్లడించాయి. కానీ మరణించినవారు సాధారణ పౌరులేనని స్థానికులు చెబుతున్నారు.
ఉగ్రవాదాన్ని అణగదొక్కడంలో విఫలమవుతున్న పాకిస్తాన్, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల రక్తంతోనే తన తప్పుడు మరకలను కడుక్కుంటోదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు తీవ్రవాద స్థావరాలను తాకకుండా వదిలేస్తూ, మరోవైపు డ్రోన్, వైమానిక దాడులతో సాధారణ గ్రామాలను శిథిలాలుగా మార్చడం పాకిస్తాన్ పాలకుల నయవంచన విధానాలకు ఉదాహరణగా మిగులుతోంది.