Karnataka New Excise Policy | ఇకపై లిక్కర్‌లో ఆల్కహాల్ శాతాన్ని బట్టి ట్యాక్స్‌!

కర్ణాటకలో ఏప్రిల్‌ 1నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. ఇకపై మద్యం బాటిళ్లలో ఆల్కహాల్ శాతాన్ని బట్టి పన్ను విధిస్తారు. ఆల్కహాల్ ఇన్ బేవరేజ్ (ఏఐబీ)గా చెప్పే ఈ విధానం ప్రపంచ వ్యాప్తంగా గోల్డ్ స్టాండర్డ్‌గా పేరొందింది. ఈ విధానాన్ని దేశంలో మొదటి సారిగా కర్ణాటక ప్రభుత్వం అమలుచేయబోతున్నది.

siddaramaiah-liquor-policy-aib-system

Karnataka New Excise Policy | అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కర్ణాటక రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చారు. శుక్రవారం కర్ణాటక విధాన సౌధలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించారు. దీంతో 60 ఏళ్లుగా కొనసాగుతున్న ఎక్సైజ్ చట్టానికి చరమగీతం పాడినట్టయింది. నూతన సంస్కరణలతో మద్యం వినియోగదారులపై భారం మున్ముందు తగ్గనున్నది.

ప్రస్తుతం 16 రకాల పన్ను స్లాబులు ఉండగా, నూతన విధానంతో ఆ సంఖ్య 8కి తగ్గిపోనున్నది. పన్ను ఎగవేతను నిరోధించేందుకు ఆధునిక సాంకేతిక విధానాన్ని అమలు చేయనున్నారు. మద్యం రవాణా, పంపిణీ విధానాన్ని పర్యవేక్షించేందుకు బ్లాక్ చైన్ డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టనున్నారు. ప్రతి వాహనానికి ‘జియో ఫెన్స్‌డ్‌ ఈ లాక్ సిస్టమ్’ అమర్చనున్నారు. దీని వల్ల అక్రమ మద్యం రవాణాకు అడ్డుపడుతుందని కర్ణాటక ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.

సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న లిక్కర్ లైసెన్స్ గడువు విధానాన్ని ఒక ఏడాది నుంచి ఐదు సంవత్సరాలకు పెంచారు. ఆన్ లైన్ లో ఇక నుంచి 8 దశల్లో రెండు రోజుల్లోనే అనుమతులు మంజురు చేయనున్నారు. డిస్టిలరీ, బ్రూవరీస్ కంపెనీలు 24 గంటలూ పనిచేసేలా అనుమతించనున్నారు. పాత విధానంలో కాకుండా ఇక నుంచి డిజిటల్ కౌన్సెలింగ్ ద్వారా ఎక్సైజ్ సూపరింటెండెంట్ల, ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి.

వైన్ టూరిజాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు పర్యాటకులు నేరుగా డిస్టిలరీలు, బ్రూవరీలకు వెళ్లి తమకు నచ్చిన మద్యం బ్రాండ్ల రుచి చూసే అవకాశం కల్పించారు. దీని వల్ల తమకు నచ్చిన లేదా కొత్త బ్రాండ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం మద్యం ప్రియులకు ఉంటుంది. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ను కేవలం పన్నులు వసూలు చేసే విధంగా పరిమితం చేసి, డీ అడిక్షన్, రిహాబిలిటేషన్ బాధ్యతలను వైద్య, ఆరోగ్య శాఖకు అప్పగించారు. ఎక్సైజ్ శాఖలో తీసుకువచ్చిన సంస్కరణల మూలంగా పారదర్శకత పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest News