Ayodhya | అయోధ్య‌.. ఆ 15 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మాంసాహారం నిషేధం..!

Ayodhya | అయోధ్య రామ‌మందిరం నిర్వాహ‌కులు కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేశారు. రామ‌మందిరానికి 15 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మాంసాహారంపై నిషేధం విధించారు. నాన్ వెజ్‌కు సంబంధించిన ఎలాంటి పదార్థాల‌కు అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

  • By: raj |    national |    Published on : Jan 10, 2026 9:48 AM IST
Ayodhya | అయోధ్య‌.. ఆ 15 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మాంసాహారం నిషేధం..!

Ayodhya | అయోధ్య రామ‌మందిరం నిర్వాహ‌కులు కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేశారు. రామ‌మందిరానికి 15 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మాంసాహారంపై నిషేధం విధించారు. నాన్ వెజ్‌కు సంబంధించిన ఎలాంటి పదార్థాల‌కు అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. పంచ‌కోషి ప‌రిక్ర‌మ ప‌రిధిలో అనేక ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌లు నాన్ వెజ్ ఐటెమ్స్‌ను డెలివ‌రీ చేస్తున్న‌ట్లు రామ మందిరం నిర్వాహ‌కుల‌కు ఫిర్యాదులు వ‌చ్చాయి. స్థానికంగా ఉన్న హోట‌ల్స్‌లో బ‌స చేసే వారికి నాన్ వెజ్ ఐటెమ్స్‌తో పాటు మ‌ద్యం స‌ర‌ఫ‌రా అవుతున్న‌ట్లు తేలింది. రామ మందిరంతో పాటు ఆ ప‌రిస‌ర ప్రాంతం క‌లుషితం కావొద్ద‌నే ఉద్దేశంతోనే ఆల‌య నిర్వాహ‌కులు క‌ఠిన చ‌ర్య‌ల‌కు పూనుకున్నారు. నాన్ వెజ్ స‌ర‌ఫ‌రా చేసే ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌ల‌తో పాటు స్థానిక హోట‌ళ్ల‌పై క‌ఠిన చ‌ర్య‌ల‌కు వెనుకాడ‌మ‌ని హెచ్చ‌రించారు.

అయోధ్య – ఫైజాబాద్‌ను క‌లిపే 14 కి.మీ. రామ‌ప‌థం మార్గంలో మ‌ద్యం, మాంసం అమ్మ‌కాల‌ను నిషేధిస్తూ 2025 మే నెల‌లో అయోధ్య మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నిర్ణ‌యం తీసుకుంది. అయిన‌ప్ప‌టికీ ఈ మార్గంలో య‌థేచ్చ‌గా మ‌ద్యం, మాంసం అమ్మ‌కాలు కొన‌సాగుతున్నాయి. 20కి పైగా దుకాణాల్లో మ‌ద్యం విక్ర‌యిస్తున్న‌ట్లు స్థానికులు తెలిపారు.

ఈ అంశంపై మున్సిప‌ల్ అధికారి స్పందించారు. మాంసం దుకాణాల‌ను ఇప్ప‌టికే తొల‌గించామ‌ని తెలిపారు. మ‌ద్యం దుకాణాల తొల‌గింపున‌కు మాత్రం జిల్లా యంత్రాంగం అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అని పేర్కొన్నారు. వారి నుంచి అనుమ‌తి తీసుకోని మ‌ద్యం దుకాణాల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అయితే మాంసంపై నిషేధం విధించ‌డంతో.. తెలివిగా ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌ల ద్వారా నాన్ వెజ్ ఐటెమ్స్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు. దీంతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశామ‌న్నారు.