విధాత, హైదరాబాద్ :
ప్రజలను క్రమశిక్షణలో పెట్టాల్సిన పోలీస్ ఉన్నతాధికారి తన తోటి మహిళా కానిస్టేబుల్ పై వేధింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపులకు తాళలేక ఆ కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం చేసింది. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ సంఘటన కొత్తగూడెంలో చోటుచేసుకుంది. అయితే, ఆ సీఐ కూడా మహిళ కావడం గమనార్హం. గతంలో ఇదే సీఐ వేధింపులకు ఎస్ఐ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. కాగా, కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ ముందు కుటుంబసభ్యులతో కలిసి మహిళా కానిస్టేబుల్ ఆందోళనకు దిగింది. ఈ ఆందోళనకు సహచర కానిస్టేబుళ్లు.. ఒక ఎస్ఐ.. మద్ధతు తెలపడం గమనార్హం.
దీనిపై స్పందించిన సీఐ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఒక డ్రామా అంటూ కొట్టిపారేశారు. పైగా తనపై అందరూ తిరగబడితే వారి పేర్లు రాసి తాను ఆత్మహత్య చేసుకుంటా అని సదరు మహిళా సీఐ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, స్టేషన్లో సిబ్బంది మధ్య గొడవలు పెట్టి, తమను సీఐ వేధిస్తోందని ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు ఎస్ఐ, కానిస్టేబుళ్లు వినతి పత్రం అందించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు.