రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తాం … కొత్తగూడెం సభలో డిప్యూటీ సీఎం భట్టి

రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు కన్నా ముందే చేసి చూపిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైతు రుణమాఫీని ఎవరు ఆపలేరన్నారు. . గురువారం కొత్తగూడెం పట్టణంలో తాగునీరు, రహదారులకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు

  • Publish Date - June 27, 2024 / 05:09 PM IST

కొత్తగూడెం, పాల్వంచ కలిపి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తాం
రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో థర్మల్ పవర్ ప్లాంట్
రైతు భరోసా అమలు కోసం ప్రజాభిప్రాయ సేకరణ

విధాత: రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు కన్నా ముందే చేసి చూపిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైతు రుణమాఫీని ఎవరు ఆపలేరన్నారు. . గురువారం కొత్తగూడెం పట్టణంలో తాగునీరు, రహదారులకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వదు ఇవ్వదు అని ప్రచారం చేశారు కానీ మేము ఒకేసారి 7,500 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ఇప్పుడు రైతుకు రుణమాఫీ చేయరు.. చేయరు ..అని ప్రచారం చేస్తున్నారు.. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని చేసి చూపిస్తామన్నారు. ఇక రైతు భరోసా విషయానికొస్తే ఎవరికి ఇవ్వాలి, ఎలా పంపిణీ చేయాలి అన్నది ప్రజాభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు చేస్తామని వెల్లడించారు. గత పాలకులు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రూ. 42 వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ చేపట్టారు కానీ ఇంటింటికి తాగు నీటిని ఇవ్వలేకపోయారన్నారు. బీఆరెస్ పాలకులు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తామన్నారు. రాష్ట్ర ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉంటామని ప్రకటించారు. గత పదేళ్లు తెలంగాణను పాలించిన వారు రాష్ట్ర సంపదను దోపిడీ చేసి, ఎవరికి పడితే వారికి పంచి, 7 లక్షల కోట్ల అప్పు చేసి.. పారిపోయారన్నారు. ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉంటామని, పైసా పైసా పోగుచేసి సంపదను సృష్టిస్తాం.. ఆ సంపదను రాష్ట్ర ప్రజలకే పంచుతామని తెలిపారు. రామగుండం లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని, త్వరలో శుభవార్త వింటారని తెలిపారు. కొత్తగూడెం పాల్వంచ రెండు పట్టణాలు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని భట్టి వెల్లడించారు. స్థానికంగా ఐటీ హబ్ ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలిస్తామన్నారు.

Latest News