డిప్యూటీ సీఎం పేషీలో 8 వేల ఫైళ్ళు…రెండేళ్లు అవుతున్నా గాడిలో పడని ఆర్థిక శాఖ

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేషీలో సుమారు 8వేల ఫైళ్ళు మూలుగుతున్నాయనే చర్చ సచివాలంలో జోరుగా సాగుతున్నది. ఒక నెల రెండు నెలలు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నుంచి ఇదే తంతు అని అంటున్నారు.

హైదరాబాద్, విధాత : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేషీలో సుమారు 8వేల ఫైళ్ళు మూలుగుతున్నాయనే చర్చ సచివాలంలో జోరుగా సాగుతున్నది. ఒక నెల రెండు నెలలు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నుంచి ఇదే తంతు అని అంటున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని రిటైర్డు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న కాంట్రాక్టర్లు సచివాలయంలోని విక్రమార్క పేషీ చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన శ్రీకాంతా చారి మాదిరి తాము కూడా ఆత్మహత్య చేసుకుంటామని కొందరు రిటైర్డు ఉద్యోగులు ఆల్టిమేటం కూడా ఇచ్చి వెళ్తున్నారు. గతంలో చిన్న కాంట్రాక్టర్లు తమ బకాయిలు చెల్లించడం లేదని ఛాంబర్ ముందే ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. కమీషన్లు ఇచ్చిన వారికే బకాయిలు ఇస్తారా, తమకు డబ్బులు ఇవ్వరా అంటూ పేషీ ఉద్యోగులను సైతం నిలదీస్తున్నట్లు సచివాలయంలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి బిల్లుల చెల్లింపులో పక్షపాతం ప్రదర్శిస్తున్నారు. కమీషన్లు ఇచ్చిన వారికే బిల్లులు మంజూరు చేస్తున్నారని, మిగతావారికి పక్కన పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ 15 శాతం కమీషన్ తీసుకుని బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. కమీషన్లు తీసుకుని బిల్లులు పాస్ చేయడం ఏంటని ఆయన నిలదీసిన విషయం విదితమే. ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు ఆర్థిక శాఖ ను సరిచేయలేదు. బకాయిలు చెల్లించాలని ఇప్పటికి రెండుసార్లు ఉద్యోగ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ప్రతి నెలా కొంత మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు కావడం లేదని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లు, కమీషన్లు ఇచ్చేవారికే నిధులు మంజూరు చేస్తున్నారని, ఉద్యోగులను పట్టించుకోవడం లేదని అంటున్నారు.

సంగారెడ్డి లోని తెలంగాణ గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేసిన పీ.సత్యనారాయణ కొన్ని నెలల నుంచి సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. హైకోర్టు ఆదేశం ప్రకారం తనకు రావాల్సిన జీతం బకాయిలు, ఫించన్ ఖరారు చేయాలని ఆయన సచివాలయంలో ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉండడంతో పరిష్కరించే అధికారం డిప్యూటీ సీఎం కు ఉండడంతో సత్యనారాయణ ఫైలును ఆయన పేషీకి పంపించారు. ఎనిమిది నెలలు అవుతున్నా ఇంత వరకు పరిష్కారానికి నోచుకోలేదు. సత్యనారాయణ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో లేఖ రాశారు. ఉద్యోగ విరమణ చేశారని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించి న్యాయం చేయాల్సిందిగా కోరారు. అయినా డిప్యూటీ సీఎం నుంచి ఎలాంటి స్పందన లేదు. గత నెల బేగంపేటలోని మహత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ప్రజా వాణిలో సత్యనారాయణ వినతి పత్రం అందచేశారు. తనను కొన్ని ప్రత్యేక కారణాలతో ఉద్యోగం నుంచి తొలగించారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. ఫైలును తమ శాఖ సకాలంలో పరిష్కరించకపోవడంతో పదవీ విరమణ జరిగిందని, దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ ఆర్థిక శాఖకు ఫైలు పంపించారన్నారు. ఏడాది కాలం దాటినా ఫైలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫించన్ ఏ తేదీ నుంచి ఇవ్వాలనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరగా, ఆర్థిక శాఖ అధికారులు సదరు ఫైలును డిప్యూటీ సీఎం మల్లు భట్టి పేషీ కి పంపించారు. ఇక అక్కడి నుంచి ఆ ఫైలుకు కదలిక లేదని, మోక్షం లభించడం లేదని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు సత్యనారాయణ వినతి పత్రంలో తెలిపారు.

చిన్న కాంట్రాక్టర్ల గోస చెప్పనలవిగా ఉన్నది. గత ప్రభుత్వంలో పూర్తి చేసిన పనులకు ఇంకా డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది నెలల క్రితం సచివాలయంలోని మల్లు భట్టి విక్కమార్క ఛాంబర్ ముందు ధర్నా కూడా చేశారు. వీళ్లకు చెల్లించే బకాయిలు రూ.1 వేయి కోట్ల లోపే ఉన్నాయని అప్పట్లో అంచనా వేశారు. వారికి కూడా ఇప్పటి వరకు బకాయిలు చెల్లించలేదు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు కూడా రెండు నెలలుగా ప్రభుత్వంపై ఫీజు బకాయిల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీ కూడా అమలు చేయడం లేదని, మీరే న్యాయం చేయాలంటూ యాజమాన్యాలు ప్రతిపక్ష నాయకుల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తమకు ఫీజు బకాయిలు ఇప్పించాలని కోరుతున్నారు. ఇక రిటైర్డు ఉద్యోగుల బాధ వర్ణనాతీతంగా ఉంది. రిటైర్మెంట్ బెన్ఫిట్స్ రెండేళ్లు దాటినా ఇవ్వడం లేదని, ఎలా బతకాలని వారు ఆర్థిక శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రతి నెలా పొదుపు చేసిన డబ్బులు కూడా ఇవ్వకుండా సతాయిస్తున్నారని, ఇది న్యాయమేనా అని నిలదీస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే తగిన శాస్తి చేశారని కొందరు ఆడిపోస్తున్నారు. బకాయిల ఫైళ్ళు పైవారికి పంపడం వరకు తమ బాధ్యత అని, మంజూరు చేసే అధికారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి చేతుల్లో ఉంటుందని ఆర్థిక శాఖ ఉద్యోగులు సర్ధిచెప్పలేక అవస్థలు పడుతున్నారు. బకాయిలు ఇవ్వకుండా ఇలాగే నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ కోసం అసువులు బాసిన శ్రీకాంతా చారి మాదిరి బలిదానం చేసుకుంటామని కొందరు రిటైర్డు ఉద్యోగులు హెచ్చరికలు చేసి వెళ్తున్నారు. తాము చేసిన హెచ్చరికను డిప్యూటీ సీఎం కు తెలియచేయాలని ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టం చేస్తుండడం గమనార్హం. ఇలా ఒకటి రెండు వర్గాలే కాకుండా అన్ని వర్గాల వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలను ఆర్థిక శాఖ మూటగట్టుకున్నది.