Watermelon | ఎండాకాలం( Summer ) వచ్చిందంటే చాలు పుచ్చకాయలు( Watermelon ) ఎక్కడంటే అక్కడ దర్శనమిస్తాయి. ఆ పుచ్చకాయలు శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తాయి. పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు అందరూ ఇష్టంగా తినే పండు కూడా ఇది. మరి ఈ పండ్లను పండించేందుకు రైతులు పడే కష్టం అంతా ఇంత కాదు. దాదాపు 3 నుంచి 6 నెలల పాటు కష్టపడితే కానీ పుచ్చకాయ పంట చేతికి అందదు. అలా ఓ రెండు వందల కుటుంబాలు ఆరు నెలల పాటు 300 ఎకరాల్లో పుచ్చకాయలు సాగు చేస్తూ.. లాభాలు గడిస్తున్నారు. మరి ఈ 200 రైతు కుటుంబాల గురించి తెలుసుకోవాలంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem District )లోని మణుగూరు వెళ్లాల్సిందే.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు( Manuguru ) మండల పరిధిలోని గోదావరి( Godavari ) లంక ప్రాంతాల్లోని కొండాయిగూడెం నుంచి చినరావిగూడెం వరకు సమీప గ్రామాలకు చెందిన రైతులు( Farmers ) పుచ్చ పంట సాగు చేస్తున్నారు. దాదాపు 200 కుటుంబాలు 300 ఎకరాల్లో పుచ్చకాయ సాగు( Watermelon Farming )లో నిమగ్నమవుతారు. ప్రతి ఏడాది దసరా పండుగ పూర్తయిన వెంటనే లంకలో సొంత పొలాలతో పాటు ఇతరులకు చెందిన భూములను కౌలుకు తీసుకుంటారు. ఆ భూముల్లో పుచ్చకాయలను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.
12 టన్నుల దిగుబడి.. టన్ను ధర రూ. 14 వేలు
ఇక పుచ్చకాయల సాగు ఒక్కో ఎకరాకు సగటున 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఒక్కో కాయ సైజు సుమారు 20 కిలోల వరకు ఉంటుంది. టన్ను పుచ్చకాయల ధర రూ. 10 వేల నుంచి రూ. 14 వేలకు పలుకుతోందని రైతులు పేర్కొంటున్నారు. పుచ్చపంట దిగుబడి తరువాత అన్ని ఖర్చులు పోగా సుమారు రూ.2 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది.
ఇతర రాష్ట్రాలకు ఎగుమతి
పండించిన పుచ్చకాయలను స్థానికంగానే కాకుండా.. ఇతర రాష్ట్రాలకు కూడా రైతులు ఎగుమతి చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
స్థానిక కూలీలకు జీవనోపాధి..
విత్తనాల దశ నుంచి పంట సాగు చేయటం, ఎగుమతి, దిగుమతితో కలిపి దాదాపు ఆరు నెలల పాటు రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు పని లభిస్తుంది. మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లోని ప్రజలు ఇక్కడికి వచ్చి పుచ్చకాయలను కొనుగోలు చేస్తుంటారు.
