Paddy Procurement | వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్ళు పూర్తయ్యేనా!?

తెలంగాణలో మే నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలంటూ తాజాగా విధించిన లక్ష్యాన్ని సాధిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Paddy Procurement | వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్ళు పూర్తయ్యేనా!?

మే నెలాఖరు డెడ్ లైన్ విధించిన మంత్రి ఉత్తమ్
భరోసా కల్పించడంలో ప్రజాప్రతినిధుల వైఫల్యం
పంట అవశేషాల దహనంతో అగ్నిప్రమాదాలు

విధాత, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో మే నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలంటూ తాజాగా విధించిన లక్ష్యాన్ని సాధిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ లకు మే నెలాఖరు వరకు అన్ని జిల్లాల్లో యుద్ధప్రతిపాదికన ధాన్యం కొనుగోళ్ళు పూర్తి చేయాలంటూ డెడ్ లైన్ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోగా, ఇప్పటి వరకు 50శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో అనుకున్న తేదీ లోపు మిగిలిన 50శాతం ధాన్యం కొనుగోళ్ళు పూర్తి చేయడం సాధ్యమా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

గత రెండు నెలలుగా పంట కోతలు సాగుతున్నాయి. నెల రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలిస్తున్నప్పటికీ సకాలంలో కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ధాన్యం కాంటాలు పూర్తిచేసినప్పటికీ మిల్లులకు తరలించేందుకు వాహనాల కొరత పీడిస్తున్నట్లు రైతులు మొత్తుకుంటున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట మినహా ఒక్క ఎమ్మెల్యే, మంత్రి కూడా ఇప్పటి వరకు రైతుల వద్దకు వచ్చి వాస్తవ పరిస్థితులు వివరించిన పాపాన పోలేదంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. అకాల వర్షాలు, గాలి దుమారం, టార్పాలిన్ లు లేక రైతులు అగచాట్లు పడుతున్నారు. కోపోద్రిక్తులైన రైతులు పలు చోట్ల ధాన్యం కుప్పలకు నిప్పంటించి నిరసనలు తెలియజేస్తున్నారు. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదంటున్నారు. మంత్రులు మాటలకే పరిమితమవుతున్నారు తప్ప అవసరమైన చర్యలు జాప్యమవుతున్నాయంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ తీరు పై రైతులతో పాటు విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

సవాళ్ళ మధ్య కొనుగోళ్ళు : ఉత్తమ్

ఈ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్ళు వంద శాతం పూర్తిచేయాలంటూ కలెక్టర్లకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డెడ్ లైన్ విధించారు. ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో ధాన్యం చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో యాసంగి-2026 ధాన్యం కొనుగోళ్లను అనేక సవాళ్ల మధ్య కూడా విజయవంతంగా నిర్వహించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకువచ్చినందుకు శాఖ ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలిపారు. ఈ ఏడాది దేశంలోనే భారీ స్థాయిలో వరి దిగుబడి వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో రైతులకు ధాన్యం చెల్లింపులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవని, కానీ ప్రస్తుతం ప్రజా ప్రభుత్వ పాలనలో 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

స్థానికంగా ఉండే హమాలీలు, రవాణా సమస్యల పరిష్కారానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ తరపున అవసరమైన ఖర్చులను రీయింబర్స్‌మెంట్ చేస్తామని తెలిపారు. 100 శాతం పెండింగ్ రైస్ డెలివరీ పూర్తి చేసిన డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి అండర్‌టేకింగ్ తీసుకుని ధాన్యం కేటాయింపు చేయాలని మంత్రి పేర్కొన్నారు. అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మొత్తం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు జిల్లా కలెక్టర్లు పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. తప్ప, తాలు కారణాలతో మిల్లర్లు రైతులకు ఇబ్బంది గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల నిర్వహకులు డాటా ఎంట్రీ చేసిన 24 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాలో జమవుతాయని భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో 21 కోట్ల గన్నీలు కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని గన్నీల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కని విని ఎరుగని రీతిలో ధాన్యం దిగుబడి రాష్ట్రంలో అయిందని ఇప్పటికే రైతుల ఖాతాల్లో 45 వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయని తెలిపారు. రైతుల పక్షపాత ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ఈ సందర్భంగా అన్నారు. హమాలీ గోదాములు, రవాణా సమస్యలు ఉంటే సివిల్ సప్లై శాఖ పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా పంట అవశేషాలకు నిప్పంటించడంతో పలుచోట్ల అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రైతుల్లో అవగాహన కల్పించాలని కోరారు. !!!

Read More:

KTR | ఉచిత విద్యుత్తు రద్దు కోసమే కాంగ్రెస్ మోటార్లకు మీటర్లను పెడుతుంది: కేటీఆర్

Indiramma Bima | జూన్ 2 నుంచి ‘ఇందిరమ్మ బీమా’