Husband Suicide | బతికేందుకు ప్రభుత్వ ఉద్యోగమే అవసరం లేదు. నచ్చిన పని కూడా చేసుకుంటూ బతుకొచ్చు.. ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుని జీవిద్దామని భార్య మంచి మాటలు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే బాధలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్న భర్తకు అన్ని విధాలా ఆమె సర్దిచెప్పింది. కానీ క్షణికావేశంలో భర్త ఉరేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన హన్మకొండ జిల్లా వేలేరు మండలంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వేలేరు మండలం షోడాషపల్లి గ్రామానికి చెందిన బండారి కుమారస్వామి(32) గత కొన్నేండ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్నాడు. కానీ అతడిని అదృష్టం వరించలేదు. ఎంత కష్టపడ్డ ఫలితం లభించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎన్ని ఉద్యోగాలకు ప్రయత్నించినా ఫలితం లేదని భార్యతో చెప్పి కుమారస్వామి బాధపడేవాడు. ఉద్యోగం రాకపోయినా వ్యవసాయం చేసుకుని జీవిద్దామని భార్య చెప్పినా వినకుండా, మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కుమారస్వామి. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే ఆత్మహత్య చేసుకున్నాడని భార్య స్వప్న తెలిపింది.
