Online Rummy| అసెంబ్లీలో రమ్మీ గేమ్ ఆడిన మంత్రి

మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మాణిక్‌రావ్‌ కోకెట్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే...తనకేమి పట్టనట్లుగా రమ్మీ ఆడుతూ కనిపించారు. మంత్రి రమ్మీ గేమ్ వీడియోను ప్రతిపక్ష ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవర్ ట్వీటర్ లో పోస్ట్ చేశారు. రైతులు, వ్యవసాయ సమస్యల గురించి సభలో చర్చలు జరుగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రి ఇలా వ్యవహరించడం ఏంటని రోహిత్ పవర్ మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పనితీరుకు ఇది నిదర్శనమని విమర్శించారు.

  • By: Subbu |    national |    Published on : Jul 20, 2025 7:08 PM IST
Online Rummy| అసెంబ్లీలో రమ్మీ గేమ్ ఆడిన మంత్రి

Online Rummy|

విధాత : రాష్ట్రానికి దేవాలయంగా భావించే అసెంబ్లీలో బాధ్యతతో ప్రజాసమస్యలపై చర్చించి..చట్టాలను రూపొందించాల్సిన ఎమ్మెల్యేలు, మంత్రులు తమ అనుచిత ప్రవర్తనతో తమ స్థాయిని దిగజార్చుకోవడంతో పాటు చట్టసభల ఔన్నత్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఇందుకు మహారాష్ట్ర అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటన నిదర్శనంగా మారింది. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుంటే.. మరోపక్క ఓ మంత్రి తన సెల్ ఫోన్ లో ఆన్ లైన్ రమ్మీ గేమ్ ఆడటం వివాదస్పదమైంది.

మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మాణిక్‌రావ్‌ కోకెట్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే…తనకేమి పట్టనట్లుగా రమ్మీ ఆడుతూ కనిపించారు. మంత్రి రమ్మీ గేమ్ వీడియోను ప్రతిపక్ష ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవర్ ట్వీటర్ లో పోస్ట్ చేశారు. రైతులు, వ్యవసాయ సమస్యల గురించి సభలో చర్చలు జరుగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రి ఇలా వ్యవహరించడం ఏంటని రోహిత్ పవర్ మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పనితీరుకు ఇది నిదర్శనమని విమర్శించారు.

రాష్ట్రంలో రోజుకు 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినప్పటికీ వ్యవసాయ మంత్రి వీటన్నింటినీ పట్టించుకోకుండా ఆటలాడుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి మంత్రులున్న ప్రభుత్వంలో రైతుల సమస్యలైన మద్దతు ధర, పంట బీమా, రుణమాఫీలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందని మండిపడ్డారు. అప్పుడప్పుడైన పేద రైతుల పొలాలను సందర్శించండి మహారాజా అంటూ మంత్రిపై పవార్ సెటైర్లు వేశారు. ఈ ఘటనపై శివసేన(యూటీబీ) ప్రతినిధి ఆనంద్ దూబే స్పందిస్తూ మంత్రి కోకెట్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రిపై సీఎం ఫడ్నవిస్ చర్యలు తీసుకోవాలని కోరారు.