Income vs Expenses | నెలాఖరుకల్లా ఖాతాలు ఖాళీ.. కార్పొరేట్‌కు పోగుపడుతున్న సొమ్ము
తగినంత జీతం వస్తున్నదని సంతోషిస్తున్నా.. నెలాఖరుకు ఖాతా ఖాళీ అవుతుండటం చాలా మందికి అనుభవమే. మరి ఈ సొమ్మంతా ఎటు పోతున్నది? ఎవరు గుంజేస్తున్నారు?
- జీవిత కాలం ఈఎంఐ చెల్లింపులే
- ప్రజల కష్టార్జితం కార్పొరేట్ల పాలు
- ఏటా కార్పోరేట్ల చేతుల్లోకి లక్షల కోట్ల సంపద
- స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకు డిపాజిట్లు, వ్యక్తిగత, హౌసింగ్…
విధాత, హైదరాబాద్:
Income vs Expenses | భారత ప్రజల సంపద అంతా కార్పొరేట్ల చేతుల్లోకి వెళుతున్నదా? సగటు వేతన జీవులు, అల్పాదాయ వర్గాలు, చిరు వ్యాపారులు, దిగువ, ఎగువ మధ్యతరగతి ప్రజల జేబులు మనకు తెలియకుండానే ఖాళీ అవుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. మరి ప్రజల వద్ద చెలామణిలో ఉండే ఈ సొమ్మంతా ఎటు వెళుతున్నది? ఎలా వెళుతున్నది?
నెలకు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు సంపాదించే వారు సైతం నెల చివరి వారంలో చేబదుళ్ల కోసం పక్కవాడి వైపు చూసే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? పర్సనల్ లోన్స్ ఇస్తామంటూ మొబైల్ ఫోన్లకు వచ్చే కాల్స్ కోసం ఎదురుచూసే పరిస్థితి చాలా మందికి ఎందుకు ఏర్పడుతున్నది?
కొన్ని దశాబ్దాల క్రితం సంగతులు మాట్లాడుకుంటే.. ఆ రోజుల్లో ఆదాయాలు లక్షల్లో లేక పోవచ్చు.. కానీ.. అడ్డగోలుగా అప్పులు చేయాల్సిన పరిస్థితి మాత్రం ఉండేది కాదు. వచ్చే వేతనం లేదా ఆదాయంలో ఆదాయంలో ఖర్చులు పోను అంతో ఇంతో వెనుకేసుకునే వాతావరణం ఉండేదని రిటైర్డ్ ఉద్యోగి రామకృష్ణ చెప్పారు. దానికి ఒక ఉదాహరణ కూడా ఆయన చెప్పారు. ఆయనకు ఉద్యోగం వచ్చిన కొత్తల్లో చందానగర్ ఏరియాలో హుడా ఒక లేఅవుట్ చేసింది. దీనికి రామకృష్ణ కూడా అప్లై చేసుకున్నారు. లాటరీ తీసి ప్లాటు కేటాయించారు. ప్లాటు ధరను ఆయన జీతం నుంచి నెలకింత చొప్పున కట్ చేసుకున్నారు. పదేళ్లలో ఆ ప్లాటు ఆయన సొంతమైంది. ఆ ప్లాటులో ఇల్లు కట్టుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులే. ఒకరి వేతనం ప్లాటుకు చెల్లించే మొత్తం, కొడుకుల చదువులు, ఇతర ఖర్చులకు సరిపోయేది. ఇక ఆయన భార్య జీతం మొత్తం పొదుపు చేసుకుంటూ వచ్చారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన ఇద్దరు పిల్లలు ఉద్యోగం చేసుకుంటున్నారు. భార్యలు కూడా ఎంప్లాయీసే. అయినప్పటికీ వాళ్లకు వస్తున్న ఆదాయం.. ఖర్చులకు సరిపోవడం లేదని బాధపడుతున్నారు. నెల చివరి వారం వచ్చే వరకు అకౌంట్ ఖాళీ అవుతుందని వాపోతున్నారని రామకృష్ణ చెబుతున్నారు.
సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారీ విధానం వికృతరూపం దాల్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. దాని ఫలితంగానే.. ఎంత సంపాదించినా నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వకూడా మిగలకుండా పోయే పరిస్థితి నెలకొందని వారు పేర్కొంటున్నారు.
పెట్టుబడిదారీ వర్గం.. కలల ప్రపంచాన్ని మనకు చూపించి.. ఆ ప్రపంచంలో విహరింపచేసి.. మన సంపదను లాగేసుకుంటున్నదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. దీనికే ముద్దుగా స్టేటస్ అనే పదం తగిలించారని అంటున్నారు.
నెలకు రెండు లక్షల రూపాయల వరకు సంపాదించే ఒక జంటకు ఇద్దరు పిల్లలు ఉంటే.. వారిని వారి స్టేటస్‌కు తగిన విధంగా చదివించేందుకు, పెంచేందుకు ఒక్కొక్కరికి ఏడాదికి మూడు నుంచి 5 లక్షల వరకూ అవుతున్నదని అంటున్నారు. స్టేటస్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీల్లో కోట్ల రూపాయలతో విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2బీహెచ్‌కే ఫ్లాట్‌కు కోటి రూపాయలకు తక్కువ కావడం లేదు. దీనికి కనీసం పాతికేళ్లు నెలకు అటూఇటూగా లక్ష వరకూ ఈఎంఐలు చెల్లించాల్సిందే. కనీసం ఒక కారు.. ఇంట్లో పెద్ద స్మార్ట్ టీవీ.. ఇలా మనిషి తన స్టేటస్‌ను చాటుకునే వాతావరణాన్ని కార్పొరేట్ సంస్థలు క్రియేట్ చేశాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఒక విధంగా ఇదొక విషవలయమని అంటున్నారు. ఇది ఒక్క ఎగువ, దిగువ మధ్య తరగతి పరిస్థితే కాదు! సామాన్యులకు కూడా వారివారి స్థాయిలో ఈ పోటీ వాతావరణం తగులుకుందని చెబుతున్నారు.
తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివించడాన్ని నామోషిగా భావించే వాతావరణాన్ని మధ్యతరగతి సామాన్య ప్రజల్లో సైతం కార్పొరేట్ వర్గాలు సృష్టించాయని అంటున్నారు. ప్రభుత్వ స్కూళ్ల పట్ల పాలకుల నిర్లక్ష్య ధోరణి కూడా సామాన్య ప్రజలను సైతం కార్పొరేట్ లేదా ప్రైవేటు స్కూళ్ల వైపు నెట్టేస్తున్నది. పిల్లలు బాగా చదువుకుంటారనే పేరుతో ఆస్తులు అమ్మి మరీ పిల్లలను చదివించుకునే కుటుంబాలు ఉన్నాయి. ఫలితంగా వచ్చిన ఆదాయం వచ్చినట్టే చేజారిపోతున్నది.
వైద్యం పరిస్థితి మరీ దుర్మార్గంగా తయారైంది. ఇంట్లో ఎవరికైనా తీవ్ర అనారోగ్యం తలెత్తితే… ఆయా కుటుంబాలు ఒక్కోసారి ఆర్థికంగా మళ్లీ కోలుకోలేనంత స్థాయిలో దెబ్బ తింటున్నాయి. చిన్నపాటి వైద్యానికి కూడా లక్షల్లో చెల్లించుకోవాల్సి వస్తున్నది. అటు విద్య, ఇటు వైద్యం.. ఈ రెండు రంగాలను కార్పొరేట్ శక్తులు శాసిస్తున్నాయి. ఫలితంగానే.. ఒకప్పుడు చౌకగా అందించిన వైద్యం, ఉచితంగా లభించిన విద్య.. ఇప్పుడు ఖరీదైన వ్యవహారాలుగా తయారయ్యాయి.
2022–23 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక ప్రకారం.. ప్రతి కుటుంబం సగటున వైద్యానికి 10 శాతం వరకు ఖర్చు చేస్తున్నది. కొంత మంది 25 శాతం వరకు ఖర్చు చేస్తున్నారు. ఆదాయంలో పెద్ద భాగం విద్యకే ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. తమ ఆదాయంలో సగటున 13 శాతం నుంచి 35 శాతం వరకు పిల్లల విద్య కోసం ప్రతి నెల కేటాయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. విడిగా కోచింగ్ ఇప్పించాలన్నా.. ప్రొఫెషనల్ కోర్సులు చదివించాలన్నా.. ఆదాయంలో 80 శాతం వరకూ ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తున్నదని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో అప్పటి వరకూ దాచుకున్న సొమ్మును సైతం బయటకు తీయాల్సి వస్తుందని, అదీ సరిపోకపోతే స్థిరాస్తులు అమ్ముకోక తప్పదని ఒక మధ్యతరగతి పెద్దమనిషి చెప్పారు. భోజనానికి కాకుండా ఆరోగ్యానికి, ఇతర సేవలకు పెట్టే ఖర్చులే కుటుంబ ఆదాయంలో ఎక్కువగా ఉన్నాయని హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్‌పెండేచర్ సర్వే చెబుతోంది.
ఇన్ని రకాల ఖర్చులను తట్టుకొని… అంతో ఇంతో వెనుకేసుకొని.. భవిష్యత్ అవసరాల కోసం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇలా వివిధ రకాలుగా పెట్టే పెట్టుబడులన్నీ మరో రూపంలో కార్పొరేట్ల చేతుల్లోకే వెళుతున్నాయి.
దేశంలో 24 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయని అంచనా. ఈ అకౌంట్ల ద్వారా 13.6 కోట్ల మంది ప్రజలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇండియన్ స్టాక్ ఎక్సేంజ్ నివేదిక ప్రకారం ప్రజలు రూ.84 లక్షల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్‌లో డీమ్యాట్, సిప్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తున్నది. అయితే స్టాక్ మార్కెట్లు గత మూడు నెలల నుంచి నెగెటివ్‌గా ఉండటంతో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన వాళ్లు ఆందోళనకు గురవుతున్నారు.
మొత్తంగా.. వినియోగారుడి ఖర్చే కార్పొరేట్ సంస్థలకు ఆదాయంగా మారింది. గతంలో ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం ఉండేవి. విద్య, వైద్యాన్ని సేవగానే చూసే వాళ్లు. ప్రైవేట్ హాస్పిటళ్లు ఉన్నా.. డాక్టర్లు మాత్రమే వాటిని స్వయంగా నడుపుకుంటూ నామమాత్రపు ఫీజులు తీసుకునేవారు. అనవసరపు వైద్య పరీక్షలు కూడా చేసే వాళ్లు కాదు. ఇప్పుడు పాఠశాలలు కార్పొరేట్ అయ్యాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్, డీమ్డ్ యూనివర్సిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వైద్యరంగంలోనూ చిన్న ప్రైవేటు హాస్పిటళ్లు భారీ ఆకారాలు దాల్చి.. తదుపరి కార్పొరేట్ హాస్పిటళ్ల అవతారం ఎత్తాయి. ఒకప్పుడు ప్రైవేటు హాస్పిటల్‌కు డాక్టర్ ఓనర్ అయితే.. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్‌లో ఒక వేతనజీవిగా మిగిలాడు. దీంతో ఇక్కడ దోపిడీ యథేచ్ఛగా సాగిపోతున్నదనే విమర్శలు కొత్తేమీ కాదు.
వీటితో పాటు పాట్లు, ఫ్లాట్లు , ఫోన్లు, కార్లు, బైక్ లు, టీవీలు ఇలా వివిధ రకాల వస్తువుల కొనుగోళ్ల ద్వారా ఆదాయం అంతా కార్పొరేట్ల చేతుల్లోకే వెళుతున్నది. చివరికి కిరాణా సరుకులు కూడా సూపర్ మార్కెట్లు, మాల్స్, మార్ట్స్, యాప్స్ పేరుతో కార్పొరేట్ శక్తులే గుంజేస్తున్నాయి. ఫలితంగా వీధి చివర కోమటికొట్టు.. దుమ్ముకొట్టుకు పోయింది.
దేశంలో ఏ రంగంలో చూసినా కార్పొరేట్ శక్తులే పాతుకుపోయాయి. వీటికి వచ్చే లాభాల్లో అత్యధికం ఆరోగ్యం, విద్య, అహారం, విద్యుత్, టెలికం, ఇంధన రంగాల నుంచే వస్తున్నాయన్నది వాస్తవం. ఇక భారీ పరిశ్రమలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు సైతం ఈ శక్తులవే. అంతిమంగా ఇదే కార్పొరేట్ శక్తులు ఏకంగా ప్రభుత్వాలను సైతం శాసిస్తున్నాయంటే.. వాటి విశ్వరూపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram