విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా సంక్షోభంతో అంతర్జాతీయంగా ఆర్థిక, భౌగోళిక పరిణామాలలో నెలకొన్న ఒడిదుడుకులు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఆదివారం బంగారం, వెండి ధరలు భారత్ మార్కెట్ లో స్థిరంగా ఉన్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,57,040వద్ద నిలకడగా కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,43,950వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,90,000వద్ద కొనసాగుతుంది.

పశ్చిమాసియా సంక్షోభంతో భారత్ ఆర్థిక వ్యవస్థ చమురు, బంగారం, ఎరువులు, వంటనూనెలు వంటి వాటిపై అధిక విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో కేంద్రం వాటి దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో బంగారం దిగుమతి సుంకాలు పెంచడంతో దేశీయంగా బంగారం అమ్మకాలు పడిపోయాయి. అయితే ఇరాన్, అమెరికా సంక్షోభానికి పరిష్కారం లభిస్తే బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకును అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ

ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు పశ్చిమాసియా సంక్షోభం రూపంలో అతిపెద్ద ప్రతికూలత ఎదురవుతుందని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ తన తాజా నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో నెలకొన్న సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరిగాయని, యుద్ద సంక్షోభం దీర్ఘకాలికంగా కొనసాగితే, దేశీయ మార్కెట్లలో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉందని నివేదిక తెలిపింది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో.. పశ్చిమ గల్ఫ్ సహకార మండలి (GCC) ప్రాంతం నుండి భారతదేశం చేసుకున్న మొత్తం దిగుమతులలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల వాటాయే 53.9 శాతంగా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని నివేదిక పేర్కొంది. ఒకవేళ అక్కడ పరిస్థితులు త్వరగా చక్కబడితే, మన దేశ బలమైన సేవల ఎగుమతులు, నిరంతర పెట్టుబడుల మద్దతుతో భారత్ మరింత వేగంగా పురోగమించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.

మరోవైపు యుద్దం ప్రారంభం నాటి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి మొత్తం 23.6 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకోవడం, పెరిగిన ముడిచమురు ధరలు, అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్ బలపడటం వంటి కారణాల వల్ల భారత రూపాయిపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఫలితంగా యుద్ధ వాతావరణం మొదలైనప్పటి నుండి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సుమారు 4.9 శాతం మేర బలహీనపడింది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతంగా నమోదై రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత పరిమితిలోనే ఉన్నప్పటికీ, టోకు ద్రవ్యోల్బణం మాత్రం 42 నెలల గరిష్ఠ స్థాయి అయిన 8.3 శాతానికి చేరుకుంది. పెరిగిన ఉత్పత్తి వ్యయాల భారం త్వరలోనే వినియోగదారులపై పడే అవకాశం ఉంది. దీనికి తోడు చమురు ధరలు పెరుగడం, రుతుపవనాల ప్రతికూలత వంటి ఆయా అంశాలతో ధరలు పెరిగి సామాన్యుడిపై అదనపు ఆర్థిక భారం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.