Post Office RD Scheme | నెలకు రూ.5వేలు ఇన్వెస్ట్ చేస్తే లక్షల్లో సేవింగ్స్.. చక్రవడ్డీతో భారీ రాబడి ఇచ్చే పోస్టాఫీసు స్కీమ్!
Post Office RD Scheme | ప్రతి నెల కొంచెం కొంచెం సేవ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే పోస్టాఫీసు అందిస్తున్న ఈ స్కీమ్ మీకోసమే!! రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో ప్రతి నెల రూ.100 నుంచి పొదుపు చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో చక్రవడ్డీ వస్తుంది. అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ మీద వడ్డీ పొందవచ్చు.
Post Office RD Scheme | డబ్బులు పొదుపు చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడైనా పెట్టుబడి పెడదామంటే అంత స్తోమత ఉండదు. ఉన్నకాడికి ఏ పదో పరకో ఆదా చేద్దామంటే ఎక్కడ పెట్టాలో తెలియదు. అలాంటి మధ్యతరగతి ప్రజల కోసం పోస్టాఫీసులో ఒక అద్భుతమైన స్కీమ్ ఉంది. చిన్న మొత్తాలతో పొదుపు చేయాలని అనుకునే వారికోసం పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్ ఇప్పుడు మంచి అవకాశంగా మారింది.
ఈ రికరింగ్ డిపాజిట్ ద్వారా ప్రతి నెల చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసి, తక్కువ టైమ్‌లోనే ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బులు పొందవచ్చు. పైగా ప్రభుత్వ హామీతో మంచి వడ్డీ రేటు కూడా ఉంటుంది. ప్రస్తుతానికి 2026 జనవరి-మార్చి త్రైమాసికానికి 6.7 శాతం మేర వడ్డీ అందించింది. మూడు నెలలకు ఒకసారి వడ్డీ మీ అసలుతో జమ అవుతుంది. అప్పుడు తర్వాత త్రైమాసికానికి వడ్డీపైన కూడా మీకు వడ్డీ వస్తుంది. అంటే చక్రవడ్డీ పొందవచ్చన్నమాట.
మెచ్యూరిటీ టైమ్ ఎంత?
ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ మెచ్యూరిటీ టైమ్ ఐదేళ్లుగా ఉంది. ఒకవేళ మీరు కావాలంటే మెచ్యూరిటీ తర్వాత మరో ఐదేళ్లు ఈ పథకాన్ని పొడిగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో కేవలం రూ.100తోనే ఖాతా ప్రారంభించవచ్చు. డబ్బు ఆదాకు గరిష్ట పెట్టుబడి పరిమితి లేకపోవడం వల్ల ఎవరి ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా వారు నెలసరి డిపాజిట్‌ను నిర్ణయించుకోవచ్చు. అందుకే ఉద్యోగులు, చిరు వ్యాపారులు, గృహిణులు, పెన్షనర్ల నుంచి ఈ స్కీమ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.
వడ్డీ ఎంత రావచ్చు?
ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రతి నెలా రూ.5వేల చొప్పున పోస్టాఫీసు RDలో ఐదేళ్ల పాటు జమ చేస్తే.. మెచ్యూరిటీ సమయానికి సుమారు 3.56 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ఐదేళ్లలో మీ పెట్టుబడి రూ.3లక్షలు కాగా, వడ్డీ రూపంలో సుమారు రూ.56వేల వరకు వస్తుంది. అదే మరో ఐదేళ్లు ఈ RDని పొడిగిస్తే వడ్డీ రూపంలోనే 2.5 లక్షల వరకు పొందవచ్చు.
ఎలా చేరాలంటే..
ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరాలని అనుకుంటే ముందుగా మీ దగ్గరలోని పోస్టాఫీసులను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ సంబంధిత పథకం ఫామ్ నింపి, కావాల్సిన డాక్యుమెంట్లు అందించి, కనీస పెట్టుబడి కడితే మీ అకౌంట్ ఓపెన్ చేస్తారు. కాగా, చిన్న మొత్తమైనా సరే క్రమం తప్పకుండా సేవ్ చేయడం వల్ల భవిష్యత్తులో పిల్లల చదువు, వైద్య ఖర్చులు, అత్యవసర పరిస్థితులు వంటి అవసరాలను సులభంగా ఎదుర్కోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Read More:
Home Loan | హోమ్ లోన్ కడుతున్నారా.. ఈ సీక్రెట్ ట్రిక్‌తో లక్షల్లో వడ్డీ ఆదా చేసుకోవచ్చు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram