Municipal Elections | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ నేడు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఇక మిగిలింది ఎన్నికల నోటిఫికేషన్ మాత్రమే.
రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్ధత తెలుపుతూ ఈ నెల 19నే ఎస్ఈసీకి లేఖ రాసింది. ఎన్నికల ఏర్పాట్లపై ఈ నెల 20 నుంచి 23 వరకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 24 వ్యయ పరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లతో సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 19 నుంచి దశల వారీగా ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. తుది కసరత్తులో భాగంగా ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో మరోసారి ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సమావేశాలు ముగిశాక ఇవాళ సాయంత్రమే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఒకవేళ ప్రక్రియలో ఆలస్యమైతే రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 15 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ ఇలా..
రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేస్తే రేపు లేదా ఎల్లుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు 14న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.
