Asst Professors | తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కాంట్రాక్ట్ లెక్చరర్లను యథాతథంగా కొనసాగిస్తూనే అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలతో పాటు మిగతా యూనివర్సిటీల్లో 500కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల్లో నియామకం చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రాష్ట్రంలోని 13 యూనివర్సిటీల్లో మంజూరైన పోస్టులు 2994. కాగా ఇందులో 763 మంది రెగ్యులర్ బోధన సిబ్బంది ఉన్నారు. 1174 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, 544 మంది పార్ట్ టైం లెక్చరర్లు పని చేస్తున్నారు. అయితే కాంట్రాక్టు లెక్చరర్ల విధులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా, వారిని యథాతథంగా కొనసాగిస్తూ.. 500 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని గత ఏడాది ఏప్రిల్ 4న విద్యాశాఖ జీఓ21 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. ఓయూలో 250, కాకతీయలో 145 పోస్టులతో పాటు పాలమూరు, శాతవాహన తదితర విశ్వవిద్యాలయాల్లో స్వల్ప మొత్తంలో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీల పాలకమండళ్ల సమావేశంలో ఆమోదం తీసుకున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన దస్త్రాలు సీఎం కార్యాలయ పరిశీలనలో ఉన్నాయి. త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేసి.. పోస్టుల భర్తీకి ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
అసలు జీవో 21 ఏంటి..?
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ విషయంలో యూజీసీ నిబంధనలకు భిన్నంగా జీఓ 21లో పీహెచ్‌డీకి వెయిటేజీ మార్కులు తక్కువగా ఇచ్చారని, దాన్ని మార్చాలని కాంట్రాక్టు అధ్యాపకులు, నిరుద్యోగుల నుంచి అభ్యంతరాలు అందాయి. పీహెచ్‌డీ విద్యార్హతకు 10 మార్కులు కాకుండా 30 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తమను కాంట్రాక్టు అధ్యాపకులుగా గుర్తించాలని పార్ట్‌టైం అధ్యాపకుల నుంచి డిమాండ్ వస్తోంది. దాన్ని సవరించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దానిపై ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అవసరమైన సవరణలపై నివేదిక ఇవ్వాలని సీఎం కార్యాలయం అధికారులు విద్యామండలికి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. జీఓ 21లో సవరణలతో పాటు శాశ్వత పాలకమండళ్లను నియమించి.. వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియ ప్రారంభించేందుకు రాష్ట్ర సర్కారు సన్నద్ధమవుతోంది. బడ్జెట్ సమావేశాల్లో దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.
