- వందల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?
- టీజీఎస్పీడీసీఎల్లో ప్రజాధనం స్వాహా!
- 15 నెలలుగా భర్తీకాని డైరెక్టర్ పోస్టులు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదంతోనే కొనుగోళ్లు
- వాళ్లు ఉంటే ‘పని’కాదనే నియమించట్లేదా?
- విద్యుత్ ఉద్యోగుల్లో బహిరంగ చర్చలు
హైదరాబాద్, మే 14 (విధాత)
Vidyut Soudha | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే విద్యుత్ సంస్థల్లో కొనసాగుతున్న డైరెక్టర్లను తొలగించింది. మూడు సంస్థలతో పాటు తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్)లో పనిచేస్తున్న ఆరుగురు డైరెక్టర్లను కూడా ఉన్నపళంగా తీసివేసింది. తీసివేసిన వారి స్థానంలో కొత్త డైరెక్టర్లను నియమించకుండా తాత్సారం చేస్తున్నారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్లు లేని సమయంలో ఇదే అదనుగా వేల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరుగుతున్నాయని సమాచారం. కొనుగోళ్లలో వందల కోట్లు చేతులు మారినట్లు విద్యుత్ ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
డైరెక్టర్ల నియామకంలో తాత్సారం
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్)లో డైరెక్టర్ల నియామకాలు జరిగాయని, పదేళ్లుగా వాళ్లే కొనసాగుతున్నారంటూ ఒక నింద వేసి మూకుమ్మడిగా తొలగిస్తూ 2025 జనవరి నెల చివరన విద్యుత్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారి స్థానంలో సమర్ధులైన కొత్తవారిని నియమిస్తామని, నిబంధనలు కచ్చితంగా పాటిస్తామంటూ దరఖాస్తులు ఆహ్వానించింది. నోటిఫికేషన్ చూసిన పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఒక అడుగు ముందుకు కదలడం లేదు. పదిహేను నెలల నుంచి బీరువాల్లో దరఖాస్తులు మూలుగుతున్నాయి. ఏమైందో ఏమో గత నెలలో సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన ఇచ్చింది. అయితే పై స్థాయిలో జరిగిన ఒప్పందం మేరకు డైరెక్టర్ల నియామకం ఆలస్యమవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దరఖాస్తులు స్వీకరణ తరువాత ఒకటి రెండు నెలల్లో ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపిక చేయకుండా తాత్సారం చేయడంలో ముందస్తు ప్రణాళిక ఉందని అంటున్నారు.
ఇదీ చర్చ
విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు చర్చించుకుంటున్న దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో హైదరాబాద్ మహా నగరంతో పాటు చుట్టు పక్కల జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆదాయం కలిగిన, శక్తిమంతమైన సంస్థ టీజీఎస్పీడీసీఎల్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవీ విరమణ పొంది ఇంటికే పరిమితమైన ఇంజినీరును తీసుకువచ్చి సీఎండీగా నియమించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఐఏఎస్ అధికారిని సీఎండీగా నియమించి, డైరెక్టర్లను తొలగించింది. తొలగించిన డైరెక్టర్ (ఫైనాన్స్), డైరెక్టర్ (హెచ్‌ఆర్), డైరెక్టర్ (కమర్షియల్, డైరెక్టర్ (పీ అండ్ ఎంఎం), డైరెక్టర్ (ఆపరేషన్స్), డైరెక్టర్ (ప్రాజెక్స్ట్), డైరెక్టర్ (ఈఏ అండ్ డీపీఏ) స్థానంలో ఎవరినీ నియమించకుండానే పనులన్నీ చక్కబెడుతున్నారు.
క్రమం తప్పకుండా టీజీఎస్పీడీసీఎల్ కొనుగోళ్లు
కేబుళ్లు, కండక్టర్లు, మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, జంపర్లు, ఏబీ స్విచ్‌లు.. ఇలా అవసరమైన ఎన్నింటినో టీజీఎస్పీడీసీఎల్ క్రమం తప్పకుండా కొనుగోలు చేస్తుంటుంది. ఒక్క విద్యుత్ స్తంభాలు మినహా అన్నింటికీ ఎప్పటికప్పుడు టెండర్ పిలుస్తుంటుంది. టెండర్ పిలిచే ముందు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ నిర్వహించి, అందులో చర్చిస్తారు. సాధారణంగా రూ.5 కోట్లకు మించి కొనుగోలు చేసే వాటికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆమోదం ఉండాలి. మీటింగ్‌లో ఆమోదం పొందిన తరువాత టెండర్లు ఆహ్వానించడం విధానంగా వస్తున్నది. ట్రాన్స్‌ఫార్మర్లలో కూడా 25 కిలోవాట్ల నుంచి 500 కిలోవాట్ల వరకు కొనుగోలు చేస్తారు. అపార్ట్ మెంట్లు, విల్లాల్లో టర్న్ కీ కింద పనులు చేస్తారు. ఒక యజమాని చేసిన దరఖాస్తును పరిశీలించి, మెటీరియల్‌కు ఎంత చెల్లించాలో తెలియచేస్తారు. దీనికి అదనంగా పది శాతం సర్వీసు చార్జ్ విధించి, డీడీ రూపంలో కట్టాల్సిందిగా యజమానికి సూచిస్తారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విల్లాలు, అపార్ట్ మెంట్లు వెలుస్తున్నాయి. ఇవి విద్యుత్ సంస్థ ఉన్నతాధికారులు, ఉద్యోగులకు కల్పతరువుగా మారాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. విల్లాలు, అపార్ట్‌మెంట్ల యజమానుల అవసరాలను గమనించిన విద్యుత్ సంస్థ పెద్దలు తమకు అనుకూలంగా పరిస్థితులను మలచుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంలో పెద్ద మనిషి, విద్యుత్ సంస్థ ఉన్నతాధికారి చేతులు కలిపి డైరెక్టర్ల నియామకానికి అడ్డుకట్ట వేశారనే చర్చలూ ఉన్నాయి. ఫలితంగా పదిహేను నెలల నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
ఏదీ జవాబుదారీతనం?
వేల కోట్ల రూపాయలు కొనుగోళ్లు జరిగే సంస్థలో డైరెక్టర్లు లేకపోవడంతో జవాబుదారీతనం, పారదర్శకత అనేది ఉండదు. డైరెక్టర్ (పీ అండ్ ఎంఎం) కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరిస్తారు. ఏది కొనుగోలు చేయాలి? ఎందుకు కొనుగోలు చేయాలి? అనే దానిపై ఒక స్పష్టత ఉంటుంది. డైరెక్టర్లు ఉంటే తమ పప్పులు ఉడకవని భావించే భర్తీ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పదిహేను నెలల వ్యవధిలో సుమారు రూ.3వేల కోట్ల వరకు కొనుగోళ్లు జరిగాయని తెలిసింది. కనీసం పది శాతం కమీషన్ కింద రూ.300 కోట్ల వరకు పెద్దలకు సమకూరినట్లు విశ్వసనీయ సమాచారం. కొద్ది నెలల క్రితం పెద్ద ఎత్తున ఇంజినీర్ల బదిలీలు జరిగాయి. డైరెక్టర్ (ఆపరేషన్స్) లేకపోవడంతో ప్రభుత్వంలో ఒక పెద్దమనిషి, విద్యుత్ సంస్థ ఉన్నతాధికారి ఏకపక్షంగా బదిలీలు చేయించారనే ఆరోపణలు వచ్చాయి. సుమారు 73 మంది ఇంజినీర్లు జిల్లాల నుంచి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చారు. ఒక్కొక్కరు తమ స్థాయి, సిఫారసును బట్టి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా ముట్టచెప్పుకున్నారని ఉద్యోగవర్గాలు చర్చించుకుంటున్నాయి. బదిలీల కోసం పలువురు ఇంజినీర్లు ప్రభుత్వంలోని ఒక పెద్దమనిషి ఇంటి వద్దకు క్యూ కట్టారని సమాచారం.
ఇవి కూడా చదవండి..
Toilet Seat Blast | ఏంటీ.. సాధారణ టాయ్‌లెట్ సీటు పేలిపోయిందా? ఎక్కడైనా జరగొచ్చా?
Telangana | ‘విద్యుత్’ డైరెక్టర్ల భర్తీ ఎప్పుడు?
PNB Housing Finance గుడ్ న్యూస్.. స్థిర వడ్డీతో గృహేతర రుణాలు