Site icon vidhaatha

Bhatti: కమిషన్ల దందాపై భగ్గుమన్న కాంట్రాక్టర్లు.. భట్టి చాంబర్ ముట్టడి!

విధాత : కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల మంజూరు కోసం తమను 20 % కమిషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ కాంట్రాక్టర్లు భగ్గుమన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు ఏకంగా సచివాలయంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఛాంబర్ ముందు ఆందోళనకు దిగారు.

వివిధ జిల్లాల నుంచి వచ్చిన 200 మంది కాంట్రాక్టర్లు భట్టి విక్రమార్కను కలిసి తమ సమస్యలను విన్నవించేందుకు సచివాలయానికి వచ్చారు. వారిని ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఆపడంతో భట్టి విక్రమార్క చాంబర్ ముందు వారు నిరసన తెలిపారు. బిల్లులు క్లియర్ కావాలంటే కనీసం 20 శాతం కమిషన్ అడుగుతున్నట్లు ఆరోపించారు. కాంట్రాక్టర్ల ఆందోళనతో అసహనానికి గురైన భట్టి విక్రమార్క సెక్రటేరియట్ నుంచి వెళ్లిపోయారు.

సాక్షాత్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి చాంబర్ ఎదుటనే కాంట్రాక్టర్లు 20శాతం కమిషన్ల తీరుపై నిరసనలకు దిగిన తీరు ప్రభుత్వంలో ఆలజడి రేపింది. ప్రభుత్వంలో పెచ్చరిల్లిన కమిషన్ రాజ్ సంస్కృతికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచిందంటు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ఆర్ ట్యాక్స్‌ పేరిట వసూళ్లు జరుగుతున్నాయని గతంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఒకటి ఢిల్లీ ఆర్(రాహుల్ గాంధీ) అని..ఇంకోటి తెలంగాణ ఆర్ రేవంత్ రెడ్డి అని మోడీ ఆరోపించారు. అదే రకమైన ఆరోపణలను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సహా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు సైతం ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి కుటుంబ సభ్యులు కూడా కమిషన్లు వసూలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు బాహటంగా ఆరోపించారు.

రేవంత్ బాబా 11 మంది దొంగల పాలన కొనసాగుతుందని ఏలేటి గతంలో ఆరోపించారు. ( BRU )ట్యాక్స్​(భట్టి, రేవంత్,ఉత్తమ్)లతో భారీగా కమిషన్ల దందా సాగుతుందోని ఆయన చేసిన ఆరోపణలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. సివిల్ సఫ్లయ్ టెండర్లు, హెటిరో, అమృత్ టెండర్ల అంశాలను ఏలేటి ప్రస్తావించారు. ఇక కేటీఆర్ సైతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరప్షన్ పెరిగిపోయిందని పదేపదే ఆరోపిస్తునే ఉన్నారు. వివిధ పనులకు సంబంధించిన బిల్లులు, ఫైళ్లు శాఖల వారిగా పెద్ధఎత్తున పెండింగ్ లో ఉండటమే నిదర్శనమని విమర్శించారు.

Exit mobile version