CM Revanth Reddy | సీఎం లేని వేళ… అసమ్మతి స్వరాల సైరన్

CM Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సాగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

CM Revanth Reddy | విధాత, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సాగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని లేని సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముగ్గురు మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీ శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ సమావేశమైన వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో అనేక ఊహగానాలు…చర్చలకు తెరలేపింది. లోక్‌భవన్‌లో గవర్నర్‌ నిర్వహించిన ఎట్‌ హోం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆ నలుగురు మంత్రులు ప్రజాభవన్ లో భట్టి నివాసంలో సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లుగా రచ్చ నెలకొంది. దీంతో భట్టి సహా మంత్రులు తమది సాధారణ భేటీ మాత్రమే అని.. మున్సిపల్ ఎన్నికలపై చర్చించామని చెబుతూ ఈ వ్యవహారాన్ని తేలిక చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందుబాటులో లేరు కాబట్టే.. మంత్రులు తనతో పలు అంశాలపై చర్చించారని భట్టి వివరించారు. తనతో పాటు సీఎం, మంత్రులంతా సమష్టిగా పని చేస్తున్నామని భట్టి స్పష్టం చేశారు.

అసలు భేటీ ఎందుకు..ఏం చర్చించారు ?

నిజానికి పరిపాలన అంశాలపైన, మున్సిపల్ ఎన్నికలపైన వారు భేటీ అయితే… పీసీసీ చీఫ్ బీ మహేష్ కుమార్ గౌడ్‌ను ఎందుకు ఈ సమావేశానికి ఆహ్వానించలేదు? రేవంత్ రెడ్దిని వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి ఈ భేటీలో ఎందుకు ఉన్నారు? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. ఫోన్ ట్యాపింగ్, సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వివాదాలపై చర్చ జరిగిందంటూ ఈ భేటీ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం రేవంత్ రెడ్డికి చేరవేశాయని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో పరస్పర అపనమ్మకం మరింత పెరిగిందన్న ప్రచారం అధికార పార్టీని కలవరపెడుతున్నది.

మళ్లీ కాంగ్రెస్.. తెలుగు కాంగ్రెస్ రచ్చకు ఆజ్యం

జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలో చేర్చుకొనడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కు గుడ్ బై కొట్టాలన్న ఆలోచనలో ఉన్న జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రజాభవన్ లో భట్టి, మంత్రులు భేటీ జరిగిందని వార్తలు వినిపించాయి. సీఎం రేవంత్ తిరిగొచ్చాక అన్నిటిపై చర్చిద్దామని ఈ సందర్బంగా జీవన్ రెడ్డికి భట్టి, మంత్రులు నచ్చచెప్పారని, అయితే ఈ భేటీలో జీవన్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి తీరుపైన తీవ్ర విమర్శలు గుప్పించారన్న ప్రచారం కూడా వినిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించడంలో… ఎన్నికల హామీల అమలులో రేవంత్ రెడ్డి తీరు సరైంది కాదని జీవన్‌ రెడ్డి అన్నారని తెలిసింది. ముఖ్యంగా ఖమ్మం సభలో టీడీపీని బలపరిచేలా మాట్లాడటాన్ని జీవన్ రెడ్డి తప్పుబట్టినట్లుగా కథనాలు వెలువడ్డాయి.

కాంగ్రెస్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి టీడీపీకి అనుకూలంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఒనగూరే లాభనష్టాలు వివరిస్తూ జీవన్ రెడ్డి ఆగ్రహం వెళ్లగక్కారని, రేవంత్ వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారన్న ప్రచారం నెలకొంది. ఇందులో నిజం ఉందో లేదోకాని..సీఎం చంద్రబాబు నాయుడు ప్రభావంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్న చర్చ నలుగురు మంత్రుల భేటీలో జరిగినట్లుగా ప్రచారం సాగింది.

హామీల మాటేమిటంటున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీల మాటమిటంటూ మరోవైపు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా క్రమంగా అసమ్మతి స్వరాలు వినిపిస్తుండటం చర్చనీయాంశమైంది. ఎన్నికల హామీలలో ప్రధానమైన పింఛన్ల పెంపు అమలు కాకపోవడం, రైతు భరోసా వాయిదా పడుతుండటంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో సైతం అసంతృప్తిని రగిలిస్తుంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ స్కామ్ లపై విచారణ జరిపి..దోచుకున్నది కక్కిస్తామంటూ ప్రచారం చేశామని, రెండేళ్లయినా కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేసు, ధరణి, గొర్రెల స్కామ్, టూరిజం స్కామ్, సీఎంఆర్ఎఫ్ స్కామ్, ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ స్కామ్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ ఫ్లాంట్ల విచారణలలో ఒక్కటి తేలలేదని గుర్తు చేస్తున్నారు. చివరకు ఫార్ములా ఈ కారు రేసులో గవర్నర్ అనుమతిచ్చినా కేటీఆర్ పై చర్యలు లేవని, ఫోన్ ట్యాపింగ్ కేసును సాగిదీస్తూ ప్రజల్లో పలుచన చేస్తున్నారన్న విమర్శలు చెలరేగుతున్నాయి.

మిత్రపక్షం టీజేఎస్ అసమ్మతి రాగం

కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న టీజేఎస్ పార్టీ అధినేత కోదండరామ్ బహిరంగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని కుండ బద్దలుకొట్టారు. ఇదే సమయంలో మరో మిత్రపక్షం సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు మాత్రం ఖమ్మంలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా విప్లవకారుడు అంటూ కీర్తీంచడం గమనార్హం. ఇది ఇలా ఉండగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరుపై పార్టీ శ్రేణుల్లో నమ్మకం పోతుందని, ఎన్నికల హామీలు నెరవేర్చలేదన్న అసంతృప్తి ప్రజల్లో బలపడుతుందని, మున్సిపల్ ఎన్నికల్లోగా మరిన్ని హామీలు అమలు చేయాలంటూ వ్యాఖ్యానించడం ఆసక్తికరం.

ఎప్పుడు పేలుతుందో తెలియని రాజగోపాల్ రెడ్డి బాంబు !

మంత్రి పదవిపై తనకు ఇచ్చిన హామీ అమలు చేయలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై గరంగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తరుచు సీఎం పనితీరుపై విమర్శల దాడి చేస్తున్నారు. మునుగోడు అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడం లేదని రేవంత్‌పై రాజగోపాల్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు ప్రభుత్వంపై బాంబు పేలుస్తానంటూ వార్నింగ్ ఇచ్చి రాజకీయంగా సంచలనం రేపారు.

మున్సిపల్ ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు

మున్సిపల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చన్న ఊహాగానాలు వినవస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన స్థానాలు సాధించలేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డిపై అసమ్మతితో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసమ్మతివాదులు తమ స్వరాలు పెంచవచ్చంటున్నారు విశ్లేషకులు. అలాగే ఈ ఎన్నికల తర్వాతా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేస్తారని, కొంతమంది మంత్రులకు ఉద్వాసన, కొత్తవారికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ కేడర్ విశ్వసిస్తుంది. ఈ పరిణామాలు కాంగ్రెస్ లో అంతర్గతంగా మరింత రచ్చ రేపవచ్చంటున్నారు విశ్లేషకులు. పంచాయతీ ఎన్నికల్లో సింహభాగం సర్పంచ్ లను గెలుచుకున్నప్పటికి..ఫలితాల సరళిలో ప్రతిపక్షాలు కొంత పుంజుకున్నట్లుగా తేలింది. దీంతో పార్టీ సింబల్ పై జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై సర్కార్ వాయిదా మంత్రం పఠించందన్న విమర్శలు సైతం వినిపించాయి.

Latest News