Harish Rao : సింగరేణి అక్రమాలపై భట్టి వ్యాఖ్యలు పెద్ద జోక్

హరీశ్ రావు భట్టి వ్యాఖ్యలను పెద్ద జోక్ అన్నారు. సింగరేణి బొగ్గు టెండర్ల అక్రమాలపై భట్టి చర్చను విమర్శిస్తూ, సైట్ విజిట్ విధానం 2025 తర్వాత మొదలైందని వెల్లడించారు.

Harish Rao

విధాత, హైదరాబాద్ : సింగరేణి బొగ్గు గనుల టెండర్ల అక్రమాలపై నాకు లేఖ రాస్తే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి విచారణ జరిపిస్తానంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం పెద్ద జోక్ గా ఉందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు ఎద్దెవా చేశారు. రేవంత్ రెడ్డినే పెద్ద దొంగ అంటుంటే… నాకు లేఖ రాయండి, రేవంత్ రెడ్డితో మాట్లాడతా అని భట్టి చెప్పడం పెద్ద జోక్‌ మాత్రమే కాకుండా..ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనే సామెతను గుర్తుకు తెస్తుందని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. భట్టి ప్రెస్ మీట్ లో నాలుగు కాగితాలు చూపి..వాటిలో ఆయనకు అవసరమైన కొన్ని వ్యాఖ్యలు చదివి మాటల గారడితో మసిపూసి మారెడు కాయ చేసేందుకు ప్రయత్నించాడని హరీష్ రావు విమర్శించారు. సింగరేణి స్కాంకు ఎవరు బాధ్యులు? ఎంత నష్టం జరిగింది? లబ్దిదారులు ఎవరు? అన్న ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా..సంబంధం లేని డాక్యుమెంట్లతో అందరి దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు.బొగ్గు కుంభకోణం బయటపెట్టిన బీఆర్‌ఎస్‌పై బురదజల్లుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. భట్టి తన ‘40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి సీఎం రేవంత్‌ని బొగ్గు స్కామ్‌ నుంచి బయటపడేసేందుకు భట్టి ప్రయత్నించారని విమర్శించారు. 2025 మేలో సైట్‌ విజిట్‌ నిబంధన వచ్చాక ఆ నిబంధనల తొలి లబ్ధిదారు సృజన్‌రెడ్డి అనే, స్కామ్‌లు జరగలేదని నమ్మించేందుకు భట్టి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నైనీ కోల్‌ బ్లాక్‌ ఒక్కటే కాదు.. సైట్‌ విజిట్‌ విధానం పెట్టిన అన్ని టెండర్లు రద్దు చేయాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ వచ్చాకే సైట్ విజిట్ విధానం తెచ్చారు

2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉందని భట్టి నిన్న ప్రెస్ మీట్లో చెబుతూ ఒక డాక్యుమెంట్ బయట పెట్టారు అని హరీష్ రావు గుర్తు చేశారు. కానీ అందులో సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎటువంటి పనులకోసం పెట్టాలని సిఫార్సు చేశారనేది చెప్పలేదు అన్నారు. అది కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కోసమా, కోల్ ఎవాక్యుయేషన్ సిస్టం కోసమా, స్క్రీనింగ్ లేదా, వాషింగ్ ప్లాంట్ కోసమా, ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసమా అనేది భట్టి బయట పెట్టలేదు అని, అందులోని ఒక లైన్ చదివితే ఇంకో లైన్ చదవ లేదు అని హరీష్ రావు తప్పుబట్టారు. సైనిక్ స్కూల్ బట్టలు ఆరబెట్టే మిషన్‌కు డిఫెన్స్ మినిస్ట్రీ సైట్ విజిట్ సర్టిఫికెట్ పెడితే..ఇది చూపించి డిఫెన్స్ వాళ్లు కూడా పెట్టారని భట్టి విక్రమార్క చెప్పారు అని, అసలు దానికి.. సింగరేణి ఓబీ బ్లాక్‌కు పెట్టిన సైట్ విజిట్ సర్టిఫికెట్‌కు ఏమైనా సంబంధం ఉందా? డ్రై క్లీనర్ టెండర్ కు, సింగరేణి టెండర్ల సైటి విజిట్ కు లింక్ పెట్టి మాట్లాడిన భట్టి తీరు హాస్యాస్పదమన్నారు. సైట్ విసిట్ సర్టిఫికేషన్ తెచ్చింది BRS ప్రభుత్వమని అబద్ధాలు చెప్తున్నాడు అని, OB వర్క్స్ కోసం BRS ప్రభుత్వంలో ఒక్క టెండర్ కూడా సైట్ విసిట్ సర్టిఫికేషన్ విధానంతో అమలు చేయలేదు అన్నారు.OB వర్క్స్ టెండర్లు సైట్ విసిట్ సర్టిఫికేషన్ విధానంతో అమలు చేయడం దేశంలో ఎక్కడా లేదు..మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే అమలు చేశారు అని హరీష్ రావు తెలిపారు. ఓబీ వర్క్ కు సైట్ విజిట్ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే తెచ్చిందన్నారు.

సీఎం బామ్మర్ధి కోసమే సైట్ విజిట్..తొలి లబ్ధిదారుడు ఆయనే

2025 జనవరిలో భూపాలపల్లిలో ఒక ఓబీ కాంట్రాక్ట్ టెండర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ లేకుండా పిలిచారు అని, అంటే పాత బీఆర్ఎస్ విధానాన్నే కొనసాగించారు అని హరీష్ రావు వెల్లడించారు. అయితే మూడు నెలల తర్వాత 2025 మేలో వీఆర్ ఓబీ టెండర్ సైట్ విజిట్ సర్టిఫికెట్‌తో పిలిచారు..తొలి లబ్దిదారుడు రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి అని హరీష్ రావు ఆరోపించారు. సైట్ విజిట్ 2025 మేలో వచ్చింది.. దాని మొదటి లబ్ధిదారుడు రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి, ఆయన కంపెనీ షోధా కన్‌స్ట్రక్షన్స్ అని, ఇంక దీనితర్వాత అన్ని టెండర్లకు సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి.. అన్ని రిగ్ చేశారని హరీష్ రావు వెల్లడించారు. 2025 మేలో సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టిన తర్వాత.. మీరు ఎన్ని టెండర్లు పిలిచారు, ఎంతమంది సైట్ విజిట్ చేశారు, ఎంత మందికి సర్టిఫికెట్ ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని హరీష్ రావు డిమాండ్ చేశారు.

సిట్టింగ్ జడ్జీతో విచారణకు ఆదేశిస్తే ఆధారాలు అందిస్తాం

కాంట్రాక్టర్లు సింగరేణి జీఎం ఆఫీస్ ముందు ఫోటో తీసుకొని మేము సైట్ విజిట్ చేసాము.. మా టెండర్‌ను కన్సిడర్ చేయండని అనేక మంది మెయిల్స్ పంపారు.ఇలా ఎన్నో కంపెనీలు మేము సైట్ విజిట్ చేసాము మాకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వలేదని చెబుతున్నారు అని హరీష్ రావు తెలిపారు. వాళ్ళు పంపిన మెయిల్స్ మీరు బైటపెడతారా నేను బైటపెట్టనా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఎన్సీసీసీ, జీఆర్ఎం, మహాలక్ష్మీ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయని తెలిపారు. సింగరేణి టెండర్లపై సిట్టింగ్ జడ్జీ విచారణకు ఆదేశిస్తే నేను అన్ని ఆధారాలను సమర్పిస్తానని హరీష్ రావు ప్రకటించారు.

త్వరలో మరిన్ని స్కామ్ లు బయటపెడుతాం

ప్రస్తుతానికి సింగరేణి బొగ్గు స్కామ్, సోలార్ స్కామ్ లు రెండు మాత్రమే నేను బయటపెట్టానని, ఇంకా చాలా స్కామ్ లు ఉన్నాయని తర్వలోనే వాటిని బయటపెడుతామని హరీష్ రావు తెలిపారు. ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో సింగరేణిలో స్కాములు జరిగాయన్నారు. సీఎం బామ్మర్ది స్వార్థం కోసమే కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో స్కీములు రాలేదుగాని స్కామ్ లు వచ్చాయి అన్నారు. రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు గాని, స్కాం క్యాలెండర్ ఇచ్చారు అని విమర్శించారు. ఈ విషయంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలన్నారు. సిట్ విచారణకు పిలిస్తే భయపడతాం అనుకుంటున్నారు అని, 2025 తర్వాత అన్ని టెండర్లకు రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డినే అని, సృజన్ రెడ్డి టీమ్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టి టెండర్లు కేటాయించారో నా దగ్గర ఫోటోలు ఉన్నాయి అని, టైం వచ్చినప్పుడు విడుదల చేస్తాను అని హరీష్ రావు వెల్లడించారు. సింగరేణి టెండర్లను సీఎంపిడిఐ, మెకాన్, ఆర్ఐపిడిఎస్ పరిశీలిస్తాయని, కాంగ్రెస్ వచ్చాక టెండర్ల ప్రక్రియలో వాటిని పక్కన పెట్టారని, తమ వారికి టెండర్లు ఇచ్చుకునేందుకే ఈ సంస్థలను పక్కన పెట్టారు అని హరీష్ రావు ఆరోపించారు. ఈ అంశాలపై ప్రభుత్వం చేత పత్రం విడుదల చేయాలి మిగిలిన కుంభకోణాలు త్వరలో బయటపెడతాం. బొగ్గు కథనంతో కాంగ్రెస్ పతనం మొదలైంది అని, స్వార్థం కోసమే సింగరేణిలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు అని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి :

BRS Boycott ABN : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌ను బహిష్కరించిన బీఆర్ఎస్
Fans War | ‘మంగాత్తా’ రీ రిలీజ్ వేళ రచ్చ …థియేటర్‌లో అజిత్–విజయ్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ

Latest News