BRS Boycott ABN : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌ను బహిష్కరించిన బీఆర్ఎస్

ఏబీఎన్ చానెల్‌కు బీఆర్ఎస్ షాక్! ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లిని అవమానించారంటూ బహిష్కరణ ప్రకటన. తెలంగాణ భవన్‌లోకి నో ఎంట్రీ.. చర్చల్లో పాల్గొనబోమని స్పష్టీకరణ..

విధాత, హైదరాబాద్ : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ ను బహిష్కరిస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పట్ల ఏబీఎన్ ఛానెల్‌ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగా.. ఇకపై అన్ని రకాల బీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశాలకు ఏబీఎన్‌ ఛానల్‌ ప్రతినిధులను అనుమతించకూడదని బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించింది. అలాగే ఏబీఎన్‌ టీవీ చానల్‌ చర్చలో బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొనరాదని తెలిపింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ కుమార్‌ ఒక ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు.

జనవరి 23వ తేదీన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌ పట్ల ఆ చానల్‌ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరును బీఆర్‌ఎస్‌ ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. గెట్ అవుట్ ఫ్రం మై చానల్‌ అని సదరు టీవీ చానల్‌ వ్యాఖ్యాత అనడం కనీస పాత్రికేయ విలువలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. డిబేట్‌లకు పిలిచిన అతిథి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆంధ్రజ్యోతి ఛానల్‌ను బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది.

తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే రాష్ట్ర నాయకత్వం పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన చరిత్ర ఆంధ్రజ్యోతికి ఉన్నదని బీఆర్‌ఎస్‌ గుర్తుచేసింది. తదననంతర కాలంలో కూడా అనేకసార్లు బీఆర్‌ఎస్‌ నాయకుల మీద అసత్య కథనాలు ప్రచురించడం/ప్రసారం చేయడం ఆంధ్రజ్యోతి గ్రూప్ పదే పదే చేస్తున్నదని మండిపడింది. బీఆర్‌ఎస్‌ పట్ల, తెలంగాణ పట్ల ఆంధ్రజ్యోతి వైఖరి మారకపోవడం వల్ల ఇకపై బీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరూ ఏబీఎన్‌ చానల్‌లో జరిగే చర్చల్లో పాల్గొనరాదని నిర్ణయించామని తెలిపింది. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో కానీ, జిల్లా కార్యాలయాల్లో కానీ జరిగే పార్టీ సమావేశాలకు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ ప్రతినిధులను ఇకపై అనుమతించరాదని నిర్ణయించినట్లుగా ప్రకటనలో స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

Elephant Birthday Video : ఏనుగు పిల్లకుపుట్టిన రోజు వేడుకలు..వీడియో వైరల్
Gold Silver Prices Today : వెండి, బంగారం ధరలకు సండే బ్రేక్

Latest News