Husband Suicide | తన భార్య గొప్పగా చదువుకోవాలి.. ఉన్నత ఉద్యోగం సాధించాలని తపన పడ్డాడు. అందుకు ప్రోత్సాహం అందించి.. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడానికి కారణమయ్యాడు. ప్రస్తుతం ఆమె ఎక్సైజ్ సీఐగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె ఉద్యోగ ప్రయత్నంలో వెన్నంటి ఉన్న భర్తకు ఊహించని పరిణామం ఎదురైంది. కంటికి రెప్పలా కాపాడుకున్న భర్తను భార్య వేధింపులకు గురి చేసింది. వరకట్నం కేసులు పెట్టి హింసించింది. ఆ వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగర పరిధిలోని నేరేడ్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన నగెల్లి శ్రీనివాస్(41) ప్రయివేటు ఉద్యోగి. 2012లో సట్లపల్లి జ్యోతితో వివాహమైంది. ఈ దంపతులకు కుమారుడు ఉన్నాడు. అయితే శ్రీనివాస్ ప్రోత్సాహంతో.. భార్య ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.. ఎక్సైజ్ సీఐగా ఎదిగింది. ప్రస్తుతం వీరు నేరేడ్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు.
ఉద్యోగం వచ్చాక భర్తను దూరం పెడుతూ.. శ్రీనివాస్ కుటుంబంపై వరకట్న వేధింపులు, విడాకుల కేసు పెట్టింది. అతను 4 నెలలుగా భార్యతో దూరంగా ఉంటున్నాడు. ఆమె వేధింపులు, కోర్టు కేసులతో మనస్తాపం చెందాడు. ‘భార్య వేధింపులు, కేసులతో ఆత్మహత్య చేసుకుంటున్నా’నని సూసైడ్ నోటు రాసి.. మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. అతడి సోదరుడు శివకృష్ణ ఇంటికి రాగా శ్రీనివాస్ మృతి చెంది కనిపించాడు. సోదరుడి ఫిర్యాదుతో శ్రీనివాస్ భార్య జ్యోతితో పాటు మరో 10మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
