Municipal Elections | ఫిబ్ర‌వ‌రిలోనే మున్సిప‌ల్ ఎన్నిక‌లు : మంత్రి పొంగులేటి

Municipal Elections | రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. ఫిబ్ర‌వ‌రిలోనే మున్సిప‌ల్ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు.

Municipal Elections | హైద‌రాబాద్ : రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. ఫిబ్ర‌వ‌రిలోనే మున్సిప‌ల్ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. వీలైనంత త్వ‌ర‌గా మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. మేడారంలో సీఎం రేవంత్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కేబినెట్ భేటీ ముగిసిన అనంత‌రం మంత్రులు సీత‌క్క‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో పదవీ కాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు జరపాల్సి ఉంది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. అందుకే ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్ర‌వ‌రి 15న‌ శివ‌రాత్రి ఉంది.. 16న రంజాన్ ఉంది.. ఆ త‌ర్వాత పిల్ల‌ల‌కు ఎగ్జామ్స్ ఉంటాయి కాబ‌ట్టి.. వీలైనంత త్వ‌ర‌గా ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని ఏక‌గ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించ‌డం జ‌రిగింది అని పొంగులేటి పేర్కొన్నారు.ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది లేకుండా ఎన్నికల షెడ్యూల్ రూపొందించుకోవాలని కేబినెట్ అధికారులకు సూచించింది అని ఆయ‌న తెలిపారు.

2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వ‌హించాల‌ని కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంద‌ని పేర్కొన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు త్వరలో కేబినెట్ సబ్ వేయాలని నిర్ణయం తీసుకుంది. బాసర నుంచి భద్రాచలం వరకు ఒక సర్క్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దేవాదాయ, రెవెన్యూ, అటవీ, పర్యాటక, పురాతత్వ శాఖల సంయుక్తంగా డీటేయిల్ రిపోర్ట్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. మార్చి 31 నాటికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం ఆదేశించిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు.

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-I ప్రాజెక్ట్‌ను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు సంబంధించి ఇంతవరకు జరిగిన పురోగతిని కేబినెట్ సమీక్షించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫేజ్-IIAలోని నాలుగు కారిడార్లు, ఫేజ్-IIBలోని మూడు కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈలోపు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రూ.2,787 కోట్ల అంచనా వ్యయమయ్యే భూ సేకరణ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్ల‌డించారు.

నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీ లా కాలేజీలో 24 కొత్త పోస్టులు, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టులు మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టుకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మండలంలో ఎకో టౌన్ డెవలప్మెంట్ కు TGIICకి 494 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు బంజారాహిల్స్‌లోని ICCC నుంచి శిల్పా లే అవుట్ రోడ్డు వరకు కొత్తగా 9 కి.మీ. కొత్త రోడ్డు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ములుగు జిల్లాలో కొత్తగా పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేబినెట్ ఆమోదించింది. రామప్ప చెరువు నుంచి నీటిని లిఫ్ట్ చేసి ములుగు జిల్లాలోని 5 గ్రామాలు, 30 చెరువులు, కుంటలను నింపడంతో పాటు.. 7500 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించనుంది. రూ.143 కోట్ల అంచనా వ్యయంతో ఈ స్కీం చేపట్టనుంది అని మీడియాకు మంత్రులు తెలిపారు.

Latest News